పవిత్రమైన తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయం (Srivari Temple) ఎదుట రాజకీయ ప్రచారాన్ని తలపించే ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో కొందరు యువకులు “పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అనే నేను” అనే పుస్తకాన్ని (Book) ప్రదర్శిస్తూ వీడియో చిత్రీకరించినట్లు కనిపించడం వివాదానికి దారితీసింది.
తిరుమలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు తప్ప రాజకీయ ప్రచారాలు, సభలు, సమావేశాలు లేదా రాజకీయ ప్రదర్శనలు జరగకుండా ప్రభుత్వం 2005 సెప్టెంబర్ 26న జారీ చేసిన జీఓ నెం. 338 ప్రకారం 27.5 చదరపు కిలోమీటర్ల పరిధిలోని వెంకటేశ్వర స్వామి ఆలయం, మాడవీధులు, కార్యాలయాలు, ఫంక్షన్ హాళ్లు, యాత్రికుల వసతి గృహాలు మరియు పరిసర ప్రాంతాలను పవిత్ర క్షేత్రంగా ప్రకటించి రాజకీయ కార్యకలాపాలకు నిషేధం (Ban) విధించింది.
ఇలాంటి నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రీల్లో జనసేన పార్టీ (Jana Sena Party) కార్యకర్తలుగా ప్రచారం జరుగుతున్న యువకులు పవన్ కళ్యాణ్‌ను ప్రశంసిస్తూ వీడియో రూపొందించినట్లు కనిపించడం చర్చకు దారితీసింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో ఆకతాయిల రీల్స్(Reels), నిబంధనల ఉల్లంఘనలకు (Rules Violations) సంబంధించిన ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి మాత్రం సాధారణ రీల్స్‌కు భిన్నంగా పవిత్ర క్షేత్రంలో రాజకీయ ప్రచారాన్ని పోలిన వీడియో చిత్రీకరణ జరగడం మరింత వివాదాస్పదంగా మారింది. అధికారంలో ఉన్నవారికి నిబంధనలు వర్తించవా? పవిత్రతను కాపాడాల్సిన ప్రదేశంలో ఇలాంటి చర్యలు ఎలా అనుమతిస్తున్నారని కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు చర్చ సాగుతోంది.






