విజయవాడలో (Vijayawada) సంచలనం సృష్టించిన డాక్టర్ దీపిక (Doctor Deepika) ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును పోలీసులు ఛేదించి ప్రధాన అనుమానితుడైన డాక్టర్ అమర్‌ను (Doctor Amar) అరెస్ట్ చేశారు.
పోలీసుల దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం, అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్న సమయంలో దీపిక, అమర్ మధ్య పరిచయం ప్రేమగా మారింది. తర్వాత ఇద్దరూ వైద్య వృత్తిలోకి వచ్చినప్పటికీ వారి సంబంధం కొనసాగింది. ప్రస్తుతం దీపిక విజయవాడ ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో (Vijayawada Government General Hospital – GGH) వైద్యురాలిగా పని చేస్తుండగా, అమర్ నందిగామలో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్నాడు.
ఇదే సమయంలో అమర్ మరో యువతితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని తెలిసిన తర్వాత దీపిక తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. గత నెల 5న ఆమె ప్రమాదకర ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.
ఆత్మహత్యకు ముందు అమర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు ఆధారాలు లభించడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. అనంతరం అమర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించడంతో అతడిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.






