---Advertisement---

ఉచిత బస్సు ప్రయాణం – మహిళల ఆత్మగౌరవానికి సవాల్ గా మారిందా?

March 20, 2026

---Advertisement---

సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా కూటమి ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బస్సులో ఎక్కిన మహిళలకు గుర్తింపు కార్డు ఆధారంగా జీరో టికెట్ ఇవ్వడం ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం మహిళలకు సౌలభ్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినప్పటికీ, ప్రస్తుతం ఇది వారి ఆత్మగౌరవంపై ప్రభావం చూపుతోందా అనే చర్చలు రాజకీయ వర్గాల్లో వేగంగా పెరుగుతున్నాయి.

మహిళలు ఈ పథకాన్ని స్వయంగా డిమాండ్ చేయకపోయినా, అమల్లోకి వచ్చిన తర్వాత దాన్ని వినియోగించడం వారి హక్కుగా భావిస్తున్నారు. అయితే, ఉచిత ప్రయాణం కారణంగా సీట్ల కొరత ఏర్పడి, చెల్లింపు చేసిన ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బస్సుల్లో మహిళల పట్ల కొందరు దురుసుగా ప్రవర్తించడం, చిన్న చూపుతో చూడడం వంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇంకా, సీట్ల విషయంలో పురుషులు-మహిళల మధ్య మాత్రమే కాకుండా మహిళల మధ్య కూడా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ వివాదాలు తీవ్రరూపం దాల్చి భౌతిక దాడుల వరకు వెళ్లిన ఘటనలు మాధ్యమాల్లో తరచూ కనిపిస్తున్నాయి. దీనితో బస్సు ప్రయాణం మహిళలకు సౌకర్యం కంటే ఒత్తిడిని కలిగిస్తున్నదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదే సమయంలో ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తనపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్లు మహిళల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాన బస్ స్టేషన్లలో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రిక్వెస్ట్ స్టాప్‌ల వద్ద బస్సులు ఆపకపోవడం, దూరంగా వెళ్లి ప్రయాణికులను దింపడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో కండక్టర్ బెల్ ఇచ్చినా డ్రైవర్లు బస్సును వెంటనే ఆపకుండా ముందుకు తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే, మహిళలకు సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం అమలులో లోపాలు ఉన్నాయనే అభిప్రాయం బలపడుతోంది. మహిళల గౌరవాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. లేదంటే, ఈ పథకం పేరుతో మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిందనే విమర్శలను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment