యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr. NTR), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ డ్రాగన్ (Dragon) ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరుగుతూనే ఉంది. అయితే ఇటీవల షూటింగ్ ఆలస్యం అవుతోందన్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. ఈ పుకార్లకు తెరదించేందుకు నిర్మాతలు తాజా అప్డేట్ ఇచ్చారు.
పవర్ఫుల్ లుక్‌తో ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్
పుకార్లకు చెక్ పెడుతూ ఎన్టీఆర్‌కు సంబంధించిన షర్ట్ లెస్ ఫోటోను (Shirtless Photod) విడుదల చేశారు. నిశ్శబ్దం పెరిగేకొద్ది భారీ శబ్దం రాబోతోంది అనే క్యాప్షన్‌తో విడుదలైన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్ఫార్మేషన్ (Body Transformation) అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.
విశాలమైన భుజాలు, సన్నని నడుముతో పక్కా ఫిట్నెస్తో కనిపిస్తున్న ఎన్టీఆర్ క్లాసిక్ పోజులో తన ఫిజిక్‌ను ప్రదర్శించారు. డ్రాగన్ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయని, వాటి కోసం ఆయన కఠినమైన వ్యాయామాలు, కఠినమైన ఆహార నియమాలు పాటిస్తున్నారని ఈ లుక్ ద్వారా అర్థమవుతోంది.
ఈ ప్రత్యేకమైన ఫిట్నెస్ కోసం షూటింగ్ షెడ్యూల్‌కు చిన్న విరామం ఇచ్చినట్లు సమాచారం. దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటారో తెలిసిందే. అదే స్థాయిలో ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ కనిపించేందుకు ప్రత్యేకంగా శ్రమిస్తున్నారు.
ఈ ఒక్క లుక్‌తోనే డ్రాగన్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.






