---Advertisement---

చంద్రగిరిలో రచ్చకెక్కిన కూటమి అంతర్గత విభేదాలు.

April 19, 2026

---Advertisement---

రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం రెండేళ్లకే అంతర్గత విభేదాలతో కుదేలవుతోందనే సంకేతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇన్నాళ్లు లోపలపలనే కొనసాగిన కోల్డ్‌వార్‌ ఇప్పుడు బహిరంగంగా బయటపడటం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో చోటుచేసుకున్న తాజా పరిణామాలు కూటమిలో పెరుగుతున్న అసంతృప్తిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

చంద్రగిరి మండలంలోని తొండవాడ గ్రామానికి చెందిన తపసి మురళీ రెడ్డి, జనసేన పార్టీకి కీలక నేతగా, ఎమ్మెల్యే నానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్థి విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన ఆయన, ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితో బయటకు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

శనివారం సాయంత్రం తిరుపతి–చంద్రగిరి రహదారిపై ఉన్న తొండవాడ కూడలి వద్ద ఎమ్మెల్యే నాని ఫోటోలతో ఉన్న బ్యానర్లను మురళీ రెడ్డి కత్తితో కోసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనను ఆయన స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేయడం ద్వారా, లోపల దాగి ఉన్న అసహనం బహిరంగమైంది. కూటమి పొత్తులో భాగంగా జనసేన నేతలను పక్కనబెడుతున్నారని, కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు దక్కడం లేదనే భావన ఈ సంఘటనకు కారణమని స్థానిక నాయకులు చెబుతున్నారు.

ఇక ఎమ్మెల్యే నానిపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోందని సమాచారం. గతంలో పనపాకం పంచాయతీలో జనసేన బ్యానర్లను చించివేసిన ఘటన కూడా రెండు పార్టీల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. జనసేన ఇన్‌చార్జి దేవర మనోహర్‌ ఎమ్మెల్యే నాని అక్రమాలు, అవినీతిపై ఫిర్యాదు చేయడం, ఈ వివాదానికి మరింత బలం చేకూర్చింది.

అటు బీజేపీ నేతలు కూడా ఎమ్మెల్యే వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కార్యక్రమాలకు ఆహ్వానం లేకపోవడం, అధికార వ్యవస్థలో గుర్తింపు లేకపోవడం వంటి అంశాలు కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలను మరింత పెంచుతున్నాయి. ఇసుక, గ్రావెల్‌ దందాలు, భూకబ్జాలు, అవినీతి ఆరోపణలు కలిపి ఎమ్మెల్యే నానిపై వ్యతిరేక వాతావరణాన్ని పెంచుతున్నాయి.

మొత్తంగా చూస్తే, చంద్రగిరిలో చెలరేగిన ఈ సంఘటన కూటమి అంతర్గత విభేదాలకు కేవలం ఆరంభమేనా? లేక ఇది పెద్ద రాజకీయ పరిణామాలకు నాంది కానుందా? అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment