మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) విమాన ప్రమాదంలో (Plane Crash) మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు మొదటి నుంచే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర విమానయాన శాఖ మంత్రి టీడీపీ (TDP) నాయకుడు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Rammohan Naidu) విచారణ పూర్తికాకముందే ప్రమాదంలో ఎలాంటి అనుమానాస్పద అంశాలు లేవని మీడియా ముందుగా ప్రకటించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రమాదానికి కారణమైన వీఎస్సార్ సంస్థ (VSR company) చైర్మన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, విమానంలో అవసరానికి మించిన ఇంధనం లోడ్ చేశారనే ఆరోపణలు, చివరి నిమిషంలో పైలెట్ మార్పు వంటి అంశాలు అనేక సందేహాలకు దారితీశాయి.
ఈ నేపథ్యంలో అజిత్ పవార్ కుటుంబ సభ్యుడురోహిత్ పవార్ నిర్వహించిన పత్రికా సమావేశం మరింత కలకలం రేపింది. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ తప్పనిసరిగా రెండు గంటలు రికార్డ్ కావాల్సి ఉండగా, కేవలం 30 నిమిషాల రికార్డింగ్ మాత్రమే లభించిందని ఆయన ఆరోపించారు.
అదేవిధంగా, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల్లో ఒకరు వీఎస్సార్ కంపెనీకి నిధులు సమకూర్చినట్టు, ఆ సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు సమాచారం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అలాగే సంస్థ చైర్మన్ వివాహ వేడుకకు టీడీపీ ప్రముఖులు హాజరైనట్టు పేర్కొన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, విమానయాన శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న రామ్మోహన్ నాయుడు తన పదవిలో కొనసాగడం నిష్పక్షపాత దర్యాప్తుకు అడ్డంకిగా మారుతుందని రోహిత్ పవార్ ప్రశ్నించారు. అందువల్ల, ఆయనను వెంటనే పదవి నుండి తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి లేఖ రాసారు.
ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తుండగా, ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు ఎలా సాగుతుందో అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.







