మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) మరణానికి కారణమైన విమాన ప్రమాదంపై (Air Crash Incident) కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఆయన కుటుంబ సభ్యుడు, మహారాష్ట్ర ఎమ్మెల్యే రోహిత్ పవార్ (Rohit Pawar) పలు సంచలన ఆరోపణలు చేశారు.
విమాన ప్రమాదం వెనుక మహారాష్ట్రలోని కొంతమంది రాజకీయ ప్రముఖుల హస్తంతో పాటు తెలుగుదేశం పార్టీ నేతల పాత్ర కూడా ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన విమానాన్ని నిర్వహించిన వీఎస్సార్ ఏవిఏషన్ సంస్థ (VSR Aviation Company) యజమాని రోహిత్ సింగ్‌కు (Rohit Singh) మహారాష్ట్ర మరియు టీడీపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల ప్రముఖులు అతని వివాహ వేడుకలకు హాజరైన విషయాన్ని గుర్తుచేశారు.
ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) ప్రమాదంపై ఎటువంటి లోపాలూ లేవని ప్రకటించడంపై రోహిత్ పవార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వీఎస్సార్ ఏవియేషన్‌పై ఇప్పటివరకు నిషేధం విధించకపోవడం అనుమానాలకు తావిస్తోందని, సంస్థను రక్షించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారనే సందేహం వ్యక్తం చేశారు. పత్రాలను తారుమారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని తెలిపారు.
అంతేకాకుండా, సంస్థ యజమాని రోహిత్ సింగ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని, దర్యాప్తు పూర్తికాకముందే దేశం విడిచిపోవడానికి అనుమతి ఎలా లభించిందని ప్రశ్నించారు. కేవలం రూ.35 కోట్ల విలువైన విమానానికి రూ.210 కోట్ల బీమా తీసుకున్నట్టు సమాచారం ఉందని, ఆర్థిక లాభం కోణంలోనూ సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (ఏఏఐబీ) బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నదని పేర్కొనడాన్ని రోహిత్ పవార్ ఖండించారు. బ్లాక్ బాక్స్ అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా రూపొందించబడిందని, అదే ప్రాంతంలో ఉన్న ఇతర భాగాలు దెబ్బతినకపోతే అది ఎలా నాశనం అయిందని ప్రశ్నించారు.
ఇక ప్రమాదంలో మరణించిన పైలట్ కెప్టెన్ సుమిత్ కపూర్‌పై కూడా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ రోజు ఆయనే విమానం నడపాల్సిన అవసరం లేకపోయినా చివరి నిమిషంలో ఆదేశాలు అందినట్టు సమాచారం ఉందని చెప్పారు. గతంలో ఆయనపై మద్యం సేవన ఆరోపణలతో సస్పెన్షన్ విధించబడిందని, వ్యక్తిగత సమస్యల నేపథ్యంలో ఆయనను బ్లాక్‌మెయిల్ చేసి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు.
ముంబై నుంచి బయలుదేరిన విమానంలో అవసరానికి మించి ఇంధనం ఉండటం, ల్యాండింగ్‌కు అనుకూల పరిస్థితులు లేకపోయినా ప్రయత్నించడం వంటి అంశాలు కూడా సందేహాలకు దారితీస్తున్నాయని తెలిపారు. ఈ ప్రమాదం వెనుక ఉద్దేశపూర్వక చర్యలున్నాయా అన్న కోణంలో సమగ్ర, స్వతంత్ర దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి, పారదర్శక విచారణ జరగకపోతే నిజాలు వెలుగులోకి రావని, అందువల్ల విచారణ పూర్తయ్యే వరకు కేంద్ర మంత్రి పదవి నుంచి రామ్మోహన్ నాయుడు తప్పుకోవాలని ఆయన స్పష్టంగా కోరారు.






