ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశం మళ్లీ రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాలు ఒక వైపు ఉండగా, ప్రజల్లో మాత్రం ఇంకా అనేక అనుమానాలు తొలగడం లేదు. పునర్విభజన చట్టంలో “అమరావతి వద్ద” అనే పదాన్ని చేర్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొత్త చర్చలకు దారితీసింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై ఉపముఖ్యమంత్రి, మంత్రులు సహా 23 మంది సభ్యులు దాదాపు ఐదు గంటలపాటు చర్చించడం జరిగింది. అనంతరం స్పీకర్ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ప్రకటించి, కేంద్రానికి పంపించారు. 2028 ఆగస్టు నాటికి అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ప్రాథమిక సమస్యలపై స్పష్టత లేకపోవడం ప్రజల్లో సందేహాలను పెంచుతోంది.
అమరావతి ప్రాంతం అత్యంత సారవంతమైన వ్యవసాయ భూములతో కూడి ఉంది. ఇక్కడ పండే విభిన్న పంటలు, రైతుల జీవనాధారం, ఆహార భద్రత వంటి అంశాలు కీలకంగా మారాయి. ఈ భూములను భారీ నిర్మాణాల కోసం వినియోగించడం సరైందా అనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. ఇక వరద ముప్పు కూడా పెద్ద ఆందోళనగా మారింది. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉండటంతో ఈ ప్రాంతం వరద ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రాంతంలో ఎన్ని వరద నివారణ ప్రాజెక్టులు నిర్మాణం చేసినా భారీ భవనాలు నిర్మించడం భవిష్యత్తులో ప్రమాదకరమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను పక్కన పెట్టడం కూడా విమర్శలకు దారితీసింది. పర్యావరణానికి తక్కువ నష్టం కలిగించే ప్రదేశాన్ని ఎంపిక చేయాలని సూచించినప్పటికీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏకపక్షంగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అమరావతి నిర్మాణ వ్యయం కూడా మరో ప్రధాన అంశం. నల్లరేగడి నేలలపై భారీ నిర్మాణాలకు అధిక ఖర్చు అవుతుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే ఇది భారంగా మారే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, రాజధాని నిర్మాణం వల్ల రైతులు, కూలీలు, చిన్న వృత్తిదారులు ఎదుర్కొంటున్న సామాజిక-ఆర్థిక సమస్యలు కూడా చర్చకు వస్తున్నాయి. భూములు కోల్పోయిన వారికి ఇచ్చే పరిహారం తగినంతగా లేదనే విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో, రాజధానిని ఒకే ప్రాంతంలో కేంద్రీకరించడం వల్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి వెనుకబడే ప్రమాదం ఉందని, వికేంద్రీకరణ అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో అమరావతి ఎంపిక వెనుక నిజమైన ప్రజా ప్రయోజనం ఎంతవరకు ఉందో, లేదా రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు ప్రభావం చూపించాయో అనే ప్రశ్నలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ అనుమానాలకు స్పష్టమైన సమాధానాలు ఇస్తుందా? లేక ఇవి మరింత పెద్ద రాజకీయ వివాదంగా మారుతాయా అనేది వేచి చూడాల్సిన అంశంగా మారింది.






