---Advertisement---

అమరావతి నిర్మాణంలో క్విడ్ ప్రో కో ఆరోపణలు?

April 11, 2026

---Advertisement---

రాజధాని అమరావతి నిర్మాణాల చుట్టూ మొదటి నుండి అనేక అవినీతి ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. అధిక ధరలకు టెండర్లు కట్టబెడుతున్నారని, మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో కమీషన్లు కాజేస్తున్నారని, ఇక అరా కొరా పనులకైతే లెక్కా పత్రాలు కూడా లేవని అమరావతి రాజధాని నిర్మాణాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో మరో వివాదంలో చంద్రబాబు గారు చిక్కినట్టుగా కనిపిస్తోంది. అమరావతి టెండర్లు దక్కించుకున్న భీమా ఇన్‌ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సంస్థ, చంద్రబాబు గారి సంస్థ అయిన హెరిటేజ్‌కు హైదరాబాద్ షామీర్‌పేటలో ఉన్న హెరిటేజ్ ఐస్‌క్రీం పార్లర్ యూనిట్‌ నిర్మాణ పనులు చేసింది. అదే కంపెనీకి సబ్‌కాంట్రాక్టుగా అమరావతి జీఏడీ టవర్ పనులు ఇవ్వడం చూస్తే “క్విడ్ ప్రో కో” జరిగిందా అనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు.

భీమా ఇన్‌ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హెరిటేజ్ నిర్మాణానికి చదరపు అడుగుకు ఎంత తీసుకుంది? అదే సంస్థ అమరావతి జీఏడీ టవర్ నిర్మాణంలో చదరపు అడుగుకు ఎంత తీసుకుంది? అనే వివరాలను తక్షణమే హెరిటేజ్ సంస్థ, అలాగే ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్లు వస్తున్నాయి. లేనిపక్షంలో ఈ సంస్థతో “క్విడ్ ప్రో కో” జరిగిందనే అనుమానాలు మరింత బలపడే అవకాశముంది.

ఇప్పటికే హైదరాబాద్‌లో సైబర్ టవర్స్ బిల్డింగ్ ప్రాజెక్టు కాంట్రాక్టులో చంద్రబాబు గారు చూపిన ఉదారత వల్ల ప్రయోజనం పొందిన “ఎల్&టీ” సంస్థ, ఎన్‌టీఆర్ భవన్‌ను ఉచితంగా నిర్మించి ఇచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల పేరిట అధిక ధరలు చూపించి షాపూర్జీ పల్లోంజీ మరియు “ఎల్&టీ” కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి, వారి నుండి రూ.118 కోట్లు టీడీపీకి చేరినట్లు ఐటీ శాఖ విచారణ చేసి చంద్రబాబు గారికి నోటీసులు పంపినట్లు గతంలో వారత్లూఉ వచ్చాయి.

ఇలా అడుగడుగునా “నీకు అది… నాకు ఇది” అన్నట్టుగా సాగుతున్న అమరావతి నిర్మాణ పనులు చంద్రబాబు గారు మరియు వారి అనుచరులకు బంగారు గనిగా మారాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హెరిటేజ్ సంస్థ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం భీమా ఇన్‌ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కాంట్రాక్టులు ఏ ప్రమాణాలపై ఇచ్చాయో ప్రజలకు స్పష్టంగా వివరించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. లేనిపక్షంలో ఇది “క్విడ్ ప్రో కో”లో భాగమేనని ప్రజలు కూడా భావించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment