మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)ను సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ను దూషించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి అంబటి కుటుంబం తరఫున ఆయన కుమార్తె అంబటి శ్రీజ (Ambati Sreeja) స్పందించారు. అమెరికాలో ఉన్న ఆమె ఓ వీడియో ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన తండ్రి గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా టీడీపీ(TDP)కి చెందిన కొందరు కర్రలతో దాడికి ప్రయత్నించారని, ఆ సమయంలో ఉద్రిక్తతలో నోరు జారిందని ఆమె తెలిపారు. ఇంటికి వచ్చిన తర్వాత తన తండ్రి పశ్చాత్తాపం వ్యక్తం చేసి, మీడియా సమావేశంలో క్షమాపణ కూడా చెప్పారని వెల్లడించారు. అయినప్పటికీ ఇంటిపై దాడి జరిగిందని, పోలీసులు రక్షణ కల్పిస్తామని చెప్పి చివరకు అరెస్ట్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాలతో సంబంధం లేని తమ కుటుంబ సభ్యులపై దాడి చేయడంతో పాటు కాపు అని దూషించారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనలన్నింటి వెనుక ఓ డాక్టర్‌తో పాటు టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి (Union Minister from TDP) ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తమ నివాసానికి వచ్చి పరామర్శించారని, వెంకటేశ్వర స్వామి అండ ఉన్నంత వరకు తమపై వేసే ప్రతి రాయి పువ్వుగానే మారుతుందని శ్రీజ అన్నారు.






