అనకాపల్లి జిల్లాలో (Anakapalli District) వరి తర్వాత అత్యంత కీలకమైన జీడి పంట (Cashew Crop) సాగు చేస్తున్న రైతులు (Farmers) ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. మంచు తెగులు తీవ్రంగా ప్రభావం చూపడంతో జిల్లాలోని జీడి తోటలు దాదాపు పూర్తిగా నాశనమయ్యాయి. పంటపై భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులకు ఈసారి పంట చేతికి రాకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక నష్టాల్లో (Financial Losses) కూరుకుపోయారు.
ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహంతో, దేవరాపల్లి మండలంలోని (Devarapalli Mandal) గిరిజన రైతులు వినూత్న నిరసన చేపట్టారు. మెడకు ఉరితాళ్లు వేసుకొని ఆందోళన వ్యక్తం చేస్తూ, తమ దయనీయ పరిస్థితిని ప్రపంచానికి తెలియజేశారు. ఈ దృశ్యాలు ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
రైతులు.. వెంటనే స్పందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ, ఎకరాకు కనీసం రూ.30,000 నుండి రూ.40,000 వరకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తమకు ఆత్మహత్యలే మార్గమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో సాగవుతున్న ఈ జీడి పంటకు భీమా సదుపాయం కూడా లేకపోవడం గిరిజన రైతుల పరిస్థితిని మరింత విషమంగా మార్చింది.
ఇంకొకవైపు, కార్పొరేట్ సంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. లక్షలాది మంది రైతులు పంట నష్టంతో విలవిలలాడుతుండగా, ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని వారు విమర్శిస్తున్నారు.
రైతు సంఘాలు తమ ప్రధాన డిమాండ్లను స్పష్టంగా తెలియజేశాయి. పంట నష్టపోయిన ప్రతి రైతుకు తక్షణ నష్టపరిహారం చెల్లించడం, రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే నేరుగా జీడి పిక్కలను కొనుగోలు చేయడం, కనీస మద్దతు ధరను రూ.200కు తగ్గకుండా నిర్ణయించడం వంటి చర్యలను వెంటనే అమలు చేయాలని వారు కోరుతున్నారు.
ఆరు నెలల పాటు కష్టపడి పంటను సాగు చేసిన రైతులకు ప్రభుత్వం అండగా నిలవకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని గిరిజన రైతులు హెచ్చరిస్తున్నారు. ఈ సంక్షోభం పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.






