ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) ఎన్నికల్లో (Elections) అనేక అవకతవకలు జరిగాయని దాని ఫలితమే కూటమి ప్రభుత్వానికి ఊహించనంత మేజారిటీ సీట్లు దక్కడంతో పాటు , అభ్యర్ధుల మేజారిటీలు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో వచ్చాయని ఇప్పటికే అనేక మంది నుండి వినిపిస్తున్న మాటలు. అయితే తాజాగా థీ వైర్ (The Wire) అనే ఆంగ్ల న్యూస్ వెబ్సైట్ లో ప్రముఖ ఆర్ధిక వేత్త , రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ (Parakala Prabhakar) రాసిన వ్యాసం సంచలనంగా మారింది. ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో వ్యవస్తీకృతంగా జరిగిన అనేక తప్పులని ఎత్తిచూపుతూ ఎన్నికల కమీషన్ కి వేసిన ప్రశ్నలు ఇప్పుడూ తీవ్ర చర్చకు దారి తీసాయి.
2024 మే 13న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ చరిత్రలో అసాధారణ ఎన్నికలుగా నిలిచాయి. 175 స్థానాల్లో 164 స్థానాలను గెలుచుకున్న కూటమి విజయాన్ని అనేకులు రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టంగా పేర్కొన్నారు. అయితే, అధికారిక గణాంకాలను సమగ్రంగా పరిశీలిస్తే, ఈ అద్భుత విజయానికి వెనుక అనుమానాస్పద గణాంక మార్పులు ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
భారత ఎన్నికల కమీషన్ , ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి విడుదల చేసిన డేటా ప్రకారం, మే 13 సాయంత్రం 5 గంటలకు పోలింగ్ శాతం 68.04%గా ప్రకటించబడింది. రాత్రి 8 గంటలకు ఇది 68.12%కి మాత్రమే పెరిగింది — మూడు గంటల్లో కేవలం 0.08% పెరుగుదల. అయితే అదే రోజు రాత్రి 11:45 నాటికి పోలింగ్ శాతం ఒక్కసారిగా 76.50%కి చేరింది.
తదుపరి మే 17న విడుదలైన గణాంకాల్లో పోలింగ్ శాతం మరింత పెరిగి 80.66%గా (ఏఛీ ప్రకారం) నమోదైంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గణాంకాల ప్రకారం ఇది 81.86%గా పేర్కొనబడింది. ఈ సంఖ్యల్లో పోస్టల్ బ్యాలెట్లు కూడా ఉన్నాయి.
గణాంకాలను (Statistics) సవివరంగా పరిశీలిస్తే, రాత్రి 11:45 నుండి మే 14 ఉదయం 2 గంటల వరకు సుమారు 17,19,482 ఓట్లు నమోదయ్యాయని అర్థమవుతోంది. సగటున ఒక్కో బూత్‌లో 491 ఓట్లు అర్ధరాత్రి తర్వాత నమోదయ్యాయని గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే, ప్రతి ఓటరుకు రెండు ఓట్లు (అసెంబ్లీ, లోక్‌సభ) వేయాల్సిన పరిస్థితిలో, ఒక్కో ఓటు నమోదు ప్రక్రియకు కనీసం ఒక నిమిషం పట్టినా, ఈ సంఖ్య సాధ్యమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారిక ప్రకటనల ప్రకారం చివరి ఓటు మే 14 ఉదయం 2 గంటల సమయంలో నమోదైంది. అయితే, అంత తక్కువ సమయంలో లక్షలాది ఓట్లు నమోదు కావడం భౌతికంగా సాధ్యమా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అదేవిధంగా, రాష్ట్ర ఎన్నికల అధికారి మరియు ఈసీఐ గణాంకాల్లో తేడాలు కూడా గమనించబడ్డాయి. పోస్టల్ బ్యాలెట్ల శాతం విషయంలోనూ విభిన్న సంఖ్యలు ప్రకటించబడడం మరో సందేహానికి తావిస్తోంది.
మే 13 సాయంత్రం 5 గంటల నుండి మే 17 వరకు మొత్తం పోలింగ్ శాతంలో 12.54% పెరుగుదల నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది సుమారు 51,83,249 ఓట్ల పెరుగుదల. ఈ ఓట్లు సమానంగా అన్ని నియోజకవర్గాల్లో విస్తరించాయా? లేక కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే కేంద్రీకృతమయ్యాయా? అనే ప్రశ్నలు మరింత చర్చకు దారి తీస్తున్నాయి.
ఈ గణాంక మార్పులు కేవలం లెక్కల వ్యత్యాసాలేనా? లేక ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తే అంశాలా? ఈ సందేహాలకు స్పష్టమైన సమాధానాలు రాకపోతే, ప్రజాస్వామ్య ప్రక్రియపై అనుమానాలు మిగిలే అవకాశముంది. అంతిమంగా, ఈ ఎన్నికల ఫలితాల వెనుక నిజమైన కథ ఏమిటి? అద్భుత విజయమా? లేక గణాంకాల గుట్టులో దాగిన మరొక వాస్తవమా? సమగ్ర, నమ్మకమైన వివరణల ద్వారానే ఈ సందేహాలకు తెరపడుతుంది. ఈ సందేహాలను తీర్చవలసిన భాధ్యత ఎన్నికల కమీషన్ మీదనే ఉందని పరకాల ప్రభాకర్ ప్రశ్నలు సంధించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఎన్నికల కమీషన్ తీరుపై తీవ్ర చర్చకు ఆస్కారమైంది.






