ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) అంగన్వాడీ కార్మికుల (Anganwadi Workers) ఆందోళన మరోసారి ఉధృతమైంది. తమ డిమాండ్లపై ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలు, స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే “చలో విజయవాడ” (Chalo Vijayawada) కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న వారు, తమ పోరాటం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
విజయవాడలోని (Vijayawada) ధర్నా చౌక్ (Dharna Chowk) వద్ద అంగన్వాడీలు రాత్రి కూడా అక్కడే బస చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. రేపటి వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నామని, ఆ తర్వాత తీసుకునే నిర్ణయంపై తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని హెచ్చరించారు.
ఇక ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు అంగన్వాడీలు ప్రకటించారు. రాత్రికి “వంట వార్పు” కార్యక్రమం నిర్వహిస్తూ తమ నిరసనను వినూత్నంగా వ్యక్తపరుస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు (Nara Chandrababu Naidu) అంగన్వాడీలు అల్టిమేటం (Ultimatum) జారీ చేశారు. రేపు ఆయన నివాసం (CM House) సమీపంలో హోలీ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. తమ డిమాండ్లు ఆమోదిస్తే ముఖ్యమంత్రితో కలిసి హోలీ (Holi Festival) జరుపుకుంటామని, లేదంటే ఆయన ఇంటి ఎదుట నిరసనగా హోలీ జరుపుతామని హెచ్చరించారు. అంగన్వాడీల ఈ హెచ్చరికల నేపథ్యంలో రేపు సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొననుంది. ప్రభుత్వం చర్చలకు ముందుకు వస్తుందా? లేక ఉద్యమం మరింత ఉధృతమవుతుందా? అన్నది రేపటి పరిణామాలపై ఆధారపడి ఉంది.






