రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు (State Assembly Sessions) ప్రారంభమైన వేళ ప్రతిపక్ష హోదా (Opposition Status) అంశం మళ్లీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రాష్ట్రంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిగా అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రజల తరఫున బలమైన స్వరం వినిపించగల ప్రత్యామ్నాయ శక్తిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మాత్రమే సభలో మిగిలిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీట్ల శాతం కాకుండా ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకుని అయినా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాజకీయ వర్గాల్లో బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రతిపక్ష నాయకుడి గుర్తింపుకు 10 శాతం సీట్లు తప్పనిసరి అన్న నిబంధన ఎక్కడా స్పష్టంగా లేనిదని నిపుణులు చెబుతున్నారు. 1977లో అమల్లోకి వచ్చిన పార్లమెంట్ చట్టం ప్రకారం, అధికార పక్షానికి వ్యతిరేకంగా సంఖ్యా బలం ఎక్కువగా ఉన్న పార్టీని స్పీకర్ ప్రతిపక్షంగా గుర్తించవచ్చని పేర్కొనబడింది. మాజీ లోక్సభ సెక్రటరీ జనరల్ పీడీటి ఆచార్య కూడా ఇదే విషయాన్ని వెల్లడించినట్లు గుర్తు చేస్తున్నారు.
2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం మూడు సీట్లు వచ్చినప్పటికీ ప్రతిపక్ష హోదా కల్పించిన ఉదాహరణను, అలాగే 1989లో తమిళనాడులో తక్కువ సీట్లున్న పార్టీకి ప్రతిపక్ష గుర్తింపు ఇచ్చిన సందర్భాన్ని రాజకీయ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి.
ప్రస్తుత ఏపీ అసెంబ్లీలో అధికార పక్షంగా మూడు పార్టీలు ఉన్నప్పటికీ ప్రతిపక్షంగా ఒక్క వైసీపీ మాత్రమే ఉండటం, 40 శాతం ఓట్లు సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య పరంగా సరైనదేనా అనే ప్రశ్నలు లేవనెత్తబడుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడికి ముఖ్యమంత్రితో సమానంగా చర్చించే అవకాశం, సమయం ఇవ్వాల్సిన నిబంధనలు ఉన్నాయని, అందువల్లే ఈ హోదా ప్రాధాన్యం సంతరించుకుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రతిపక్ష హోదా ప్రజలు నేరుగా ఇవ్వరు, స్పీకర్ గుర్తింపుతోనే అది అమల్లోకి వస్తుంది. డిల్లీ, తమిళనాడు ఉదాహరణలు దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. 40 శాతం ఓట్లు సాధించిన పార్టీకి ప్రజలు పరోక్షంగా బాధ్యత అప్పగించినట్టేనని, ఆ స్వరాన్ని సభలో ప్రతిబింబింపజేయడం స్పీకర్ బాధ్యతగా భావిస్తున్నారు.
ఇకపోతే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) వంటి కీలక కమిటీల నాయకత్వం కూడా ప్రతిపక్షానికే ఉండాలనే రాజ్యాంగ పరంపరను గుర్తు చేస్తూ, స్పీకర్ తీసుకునే నిర్ణయం ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.






