ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్‌కు ప్రభుత్వం భారీ రాయితీలు మంజూరు చేసిన విషయం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. చంద్రబాబు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ఈ రాయితీలు ఇవ్వడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
చంద్రగిరి మండలం కాశీపెంటలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ యూనిట్‌కు టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ కోసం ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అంతేకాకుండా ఐదేళ్ల పాటు 100 శాతం జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని కూడా ఆమోదం తెలిపింది. విద్యుత్ వినియోగంపై యూనిట్‌కు రూ.1 రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద ఈ రాయితీలకు ఆమోదం లభించగా, హెరిటేజ్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రకారం నెయ్యి ఉత్పత్తిని 566 శాతం, ఫ్లేవర్డ్ పాలను 131 శాతం, పన్నీర్ ఉత్పత్తిని 400 శాతం పెంచే ప్రణాళిక రూపొందించబడినట్టు సమాచారం.
అయితే ఈ నిర్ణయంపై వివాదం మరింత పెరిగింది. మంత్రి పార్థసారధి మీడియా సమావేశంలో ఈ రాయితీల గురించి ప్రస్తావించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. కేబినెట్ అజెండాలో చివరి అంశంగా చేర్చి ఆమోదం పొందినట్టు సమాచారం రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
ఇదిలా ఉండగా, తిరుపతిలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెరిటేజ్ యూనిట్‌కు కొత్తగా ఇంత భారీ రాయితీలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే ప్రశ్నలు రాజకీయ పార్టీల నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు, ఆర్థిక భారాల గురించి మాట్లాడుతున్న ప్రభుత్వం తమ కుటుంబ సంస్థలకు మాత్రం రాయితీలు ప్రకటించడం ఎంతవరకు సమంజసం అనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
సుదీర్ఘంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ రాయితీల గురించి ఎందుకు మాట్లాడలేదని కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం పారదర్శకతపై సందేహాలు వ్యక్తం చేస్తూ రాజకీయ వర్గాలు స్పందిస్తున్నాయి.






