ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా వెలుగులోకి వస్తున్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అధికారంలో ఉన్న కూటమి పార్టీలకు చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులపై లంచాలు (Bribes), కమీషన్లు (Commissions), కప్పాలు వంటి ఆరోపణలు వెల్లువెత్తడం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది.
ముఖ్యంగా ఆదోని (Adoni) నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే పార్థసారథిపై (Parthasarathi) వచ్చిన ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించాయి. భవన నిర్మాణానికి అడ్డంకులు లేకుండా చూసేందుకు రూ.50 లక్షలు డిమాండ్ చేశారని, అందులో భాగంగా రూ.10 లక్షలు ఇప్పటికే చెల్లించానని ఒక మైనార్టీ నాయకుడు బహిరంగంగా ఆరోపించడం గమనార్హం. ఈ ఆరోపణలపై ధార్మిక గ్రంథాలపై ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమని ఆయన చెప్పడం వివాదానికి మరింత బలం చేకూర్చింది.
ఇక కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుపై (Inturi Nageswara Rao) రామాయపట్నం పోర్ట్ (Ramayapatnam Port) పనుల్లో వాటా డిమాండ్ చేసినట్లు వచ్చిన వార్తలు కలకలం రేపాయి. ప్రతి లారీ ట్రిప్పుకు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తీసుకువచ్చారని, కాంట్రాక్టు సంస్థ నిరాకరించడంతో పోలీసుల సహాయంతో పనులకు ఆటంకం కలిగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో (Srikakulam) యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీకి (United Breweries Company) సంబంధించిన వ్యవహారం మరో పెద్ద వివాదంగా మారింది. నెలకు భారీ మొత్తంలో కప్పం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో పాటు, కంపెనీ నిరాకరించడంతో ఫ్యాక్టరీపై దాడులు జరిగాయని ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తాడిపత్రిలో (Tadipatri) జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారాయి. ఇసుక రీచ్లు, మద్యం దుకాణాలపై కమిషన్ వ్యవస్థ గురించి ఆయన బహిరంగంగా మాట్లాడటం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. అభివృద్ధి కోసం డబ్బులు అవసరమని చెప్పినా, ఈ విధానం సరైనదేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై (Bojjala Sudheer Reddy) తుక్కు వ్యాపారి నుండి నెలకు రూ.50 లక్షల లంచం డిమాండ్ ఆరోపణలు రావడం మరో సంచలనంగా మారింది. వ్యాపారి నిరాకరించడంతో పోలీసుల ద్వారా ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం కేంద్ర హోంశాఖ దృష్టికి వెళ్లినట్లు సమాచారం.
రాజమహేంద్రవరం సిటీలో మద్యం సిండికేట్ వ్యవహారం కూడా పెద్ద చర్చకు దారి తీసింది. ఒక్కో షాపు నుంచి మామూళ్లు వసూలు చేయాలని ఆడియోలు బయటకు రావడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. అదనంగా మద్యం ధరలు పెంచి వసూలు చేసే యత్నాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఆ డబ్బులు నేరుగా శాశన సభ్యుడికే చేరుతాయని ఆడియొలో మాట్లాడుకోవడం సంచలనంగా మారింది.
అనంతపురం అర్బన్ ప్రాంతంలో ఎగ్జిబిషన్ నిర్వహణ కోసం 10 లక్షల డబ్బులు డిమాండ్ చేసినట్లు అధికార పార్టీ శాశన సభ్యుడిపై వచ్చిన ఫిర్యాదులు కూడా అధికార పార్టీల విచ్చలవిడి దోపిడికి నిదర్శనంగా చెబుతున్నారు.
ఈ సమగ్ర పరిణామాల నేపథ్యంలో, ప్రజల్లో కూటమి సభ్యుల అవినీతి, అధికార దుర్వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తుండగా, అధికార పార్టీ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో పెద్దలకు తెలిసే దోపిడీలు చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యవహారం రానున్న రోజుల్లో మరింత ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.






