ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి రావడానికి ముందు గంజాయి (Cannabis) మరియు ఇతర మాదకద్రవ్యాలను కట్టడి చేయడంపై పెద్దఎత్తున హామీలు ఇచ్చింది. ముఖ్యంగా 100 రోజుల్లో రాష్ట్రాన్ని గంజాయి రహితంగా చేస్తామని, అది సాధ్యం కాకపోతే ప్రజల ముందు ముఖం చూపించమని నాయకులు ప్రకటించిన మాటలు అప్పట్లో పెద్ద చర్చనీయాంశమయ్యాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న వరుస డ్రగ్స్ కేసులు చూస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గంజాయి మాత్రమే కాదు, కొకైన్ (Cocaine), ఎండీఎంఏ (MDMA), మెథాంఫెటమిన్ (Methamphetamine) వంటి ప్రమాదకరమైన మాదకద్రవ్యాలు కూడా రాష్ట్రంలో అందుబాటులోకి వస్తున్నాయని పోలీసులు నమోదు చేస్తున్న కేసులు చెబుతున్నాయి.
2024 సెప్టెంబర్ 2న పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఘంటావారిగూడెంలో డ్రగ్స్ తయారీ యూనిట్‌ను పోలీసులు సీజ్ చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఈ యూనిట్లో ఆల్ప్రజోలం (Alprazolam) అనే డ్రగ్ తయారు చేసి కల్లు దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 600 లీటర్ల కల్లులో కేవలం ఒక గ్రాము ఆల్ప్రజోలం కలిపినా మత్తు కలిగే విధంగా తయారీ చేస్తున్నట్లు విచారణలో బయటపడింది.
2025 జనవరి 19న గుంటూరులో శ్యామలానగర్ ప్రాంతంలో ముగ్గురు యువకుల నుంచి ఎనిమిదిన్నర గ్రాముల కొకైన్‌ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 18న గుంటూరు సమీపంలోని గోరంట్ల, చుట్టుగుంట ప్రాంతాల్లో ఎండీఎంఏ మత్తు మందులు మరియు గంజాయి కలిగి ఉన్న 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మార్చి 22న కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఒక మెడికల్ షాప్‌లో ఐసిస్ డ్రగ్స్‌గా పిలిచే ప్రమాదకర మత్తు పదార్థాలు గుర్తించడం మరో సంచలనంగా మారింది. ఉగ్రవాద సంస్థలు వాడే ఈ తరహా డ్రగ్స్ మెడికల్ షాపుల్లో లభ్యమవడం పై అనేక ప్రశ్నలు తలెత్తాయి. షాప్ యజమాని పై ఎన్డీపీ చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏప్రిల్ 5న మంగళగిరిలో ఒక వ్యక్తి వద్ద 7 గ్రాముల కొకైన్, 500 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జూన్ నెలలో మాత్రం వరుసగా అనేక కేసులు బయటపడ్డాయి. జూన్ 3న బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఒక యువతి, తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్ సహా పలువురిని అరెస్ట్ చేశారు.
జూన్ 5న విజయవాడలో 33 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌తో ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. జూన్ 6న తిరుపతిలో యువకులు మత్తు ఇంజక్షన్లు తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేగింది. అదే నెల 21న శ్రీకాళహస్తిలో యువకులు డ్రగ్స్ వినియోగిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వారి వద్ద డ్రగ్స్ బాటిళ్లు, సిరంజీలు, గంజాయి బీడీలు పోలీసులు గుర్తించారు.
జూన్ 29న గుంటూరు జిల్లాలో 25 గ్రాముల డ్రగ్స్‌తో ఇద్దరు యువకులు పట్టుబడగా, జూలై 6న విశాఖలో ఒక వైద్యుడు డ్రగ్స్ వినియోగించినట్లు పరీక్షల్లో తేలడంతో అరెస్టు చేయడం మరో సంచలనంగా మారింది. జూలై 12న కోనసీమ జిల్లాకు చెందిన యువకులు బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి విజయవాడలో విక్రయించే సమయంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి మెథాంఫెటమిన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ వరుస ఘటనలు రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం మరియు సరఫరా నెట్వర్క్ విస్తరిస్తోందనే అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా సామాన్య ప్రజలకు దూరంగా ఉండాల్సిన మాదకద్రవ్యాలు ఇప్పుడు యువతలో విస్తరిస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక మరింత ఆందోళన కలిగిస్తున్న విషయం ఏమిటంటే కొందరు ప్రజాప్రతినిధులు, అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కూడా డ్రగ్స్ కేసుల్లో పేర్లు వినిపించడం. ఒక ఎమ్మెల్యే కుమారుడు, ఒక ఎంపీ డ్రగ్స్ వినియోగం ఆరోపణలతో తెలంగాణలో పట్టుబడిన ఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. మరోవైపు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కూడా రాష్ట్రంలో గంజాయి సరఫరాపై తీవ్ర ఆరోపణలు చేయడం పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిందో చూపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మరియు ప్రస్తుతం జరుగుతున్న ఘటనల మధ్య వ్యత్యాసం ఏమిటనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు పెరుగుతున్న డ్రగ్స్ కేసులు పెద్ద సవాలుగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డ్రగ్స్ కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రచార ఆర్బాటాలకు మాత్రం డ్రగ్స్ వద్దు బ్రో లాంటి కార్యక్రమాలు చేస్తూ సోంత పార్టీ నేతలనే డ్రగ్స్ కి దూరంగా ఉండేలా చేయడంలో విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి.






