ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న నాయకులకు లేదా వారి కుటుంబాలకు చెందిన సంస్థలకు లాభం చేకూరేలా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లోనే కాక ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి.
ఇప్పటికే విశాఖపట్నం పరిసర ప్రాంతాలైన రుషికొండ, ఎండాడ గ్రామాల్లో గీతం యూనివర్సిటీకి చెందిన భూముల అంశం (Geetham University Land Issue) పెద్ద వివాదంగా మారింది. సుమారు 54.79 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీకి సమర్పించడం చట్టవిరుద్ధమని, ఇది సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలను కూడా ధిక్కరించినట్టేనని పలువురు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు ప్రభుత్వ భూమిని కబ్జాలో ఉంచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి వారికి లాభం చేకూరేలా ప్రభుత్వం వ్యవహరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గీతం యూనివర్సిటీకి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (Hindupur MLA Balakrishna) కుటుంబంతో సంబంధం ఉండటం కూడా ఈ వివాదానికి మరింత రాజకీయ రంగు తెచ్చింది.
ఇక తిరుమల(Tirumala) లడ్డూ ప్రసాదం (Laddu Prasadam) తయారీలో ఉపయోగించే నెయ్యి టెండర్ వ్యవహారం కూడా వివాదాస్పదమైంది. హెరిటేజ్‌కు భాగస్వామ్య సంస్థగా చెప్పబడుతున్న ఇందాపూర్ డైరీకి సుమారు 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా టెండర్ అధిక ధరలకు కట్టబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నిర్ణయం ద్వారా హెరిటేజ్‌కు పరోక్షంగా లాభం చేకూర్చడానికే ప్రభుత్వం ప్రయత్నించిందని పలువురు విమర్శిస్తున్నారు.
ఇక తాజాగా చంద్రగిరి మండలం కాశీపెంటలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ (Heritage Foods) యూనిట్‌కు టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ కోసం ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించడం మరోసారి చర్చకు దారి తీసింది. ఐదేళ్ల పాటు 100 శాతం జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం, విద్యుత్ వినియోగంపై యూనిట్‌కు ప్రతి యూనిట్‌కు రూ.1 రాయితీ ఇవ్వడం వంటి నిర్ణయాలు తీసుకోవడం పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న హెరిటేజ్ యూనిట్‌కు ఇంత భారీ రాయితీలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు (Deputy CM Pawan Kalyan) సంబంధించిన అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా బెనిఫిట్ షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడమే కాకుండా టికెట్ ధరలను పెంచుకునే అవకాశం కూడా కల్పించింది. టికెట్ ధరను రూ.500 వరకు నిర్ణయించడంతో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.125 వరకు ధరలు పెంచుకునేలా 10 రోజుల పాటు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది.
ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న నాయకులు తమ కుటుంబ సంస్థలు లేదా వ్యక్తిగత వ్యాపారాలకు లాభం చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందని ప్రభుత్వం చెప్పుకుంటూనే, ఇలాంటి రాయితీలు ఇవ్వడం ఎంతవరకు సరైందని ప్రజల్లో కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు ప్రజా ప్రయోజనాల కోసం ఉండాలా, లేక అధికారంలో ఉన్నవారికి లాభం చేకూర్చడానికేనా అనే సందేహాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారుతున్నాయి.






