తెలుగు రాష్ట్రాల్లో సంచలన రచయితగా పేరుగాంచిన బొగ్గుల శ్రీనివాస్ (Boggula Srinivas) అనుమానాస్పద మృతితో సాహిత్య, రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. రాజకీయ అంశాలపై తనదైన శైలిలో రచనలు చేసి ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన మరణం ఇప్పుడు అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. ముఖ్యంగా 2014లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయ ప్రవేశంపై రాసిన “పవన్ కల్యాణ్ హటావో – పాలిటిక్స్ బచావో” (“Pawan Kalyan Hatao – Politics Bachao”) పుస్తకం (Book)సంచలనం సృష్టించి, లక్షల కాపీలు అమ్ముడైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు బెదిరింపులు రావడంతో పోలీస్ రక్షణ కూడా కల్పించబడింది.
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భర్ద్వాజ్ (Raavuri Bharadwaj) రచనలపై సమగ్ర పరిశోధన చేసి సాహిత్య ప్రపంచానికి వెలుగులోకి తీసుకువచ్చిన వ్యక్తిగా కూడా బొగ్గుల శ్రీనివాస్ ప్రత్యేక గుర్తింపు పొందారు. అలాంటి వ్యక్తి మృతదేహం ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని పాలేరు రిజర్వాయర్ లో కారులో కనిపించడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.
తనతో చదువుకున్న వ్యక్తికి చెందిన కారులో వెనుక సీట్లో మృతదేహం లభించడం, కారు బోల్తాపడిన వెంటనే మరో వ్యక్తి పరారైనట్లు స్థానిక మత్స్యకారులు చెబుతుండటం కేసును మరింత సంక్లిష్టం చేస్తోంది. తలకు గాయాల ఆధారంగా ఇది ప్రమాదమా లేదా హత్య చేసి ప్రమాదంగా మలిచారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం రూరల్ ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు విచారణ కొనసాగిస్తున్నాయి.
కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామానికి చెందిన బొగ్గుల శ్రీనివాస్ ఎం.ఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) పూర్తి చేసి సాహిత్య రంగంలో అడుగుపెట్టి అనేక సంచలనాలకు కేంద్రబిందువయ్యారు. ఇప్పుడు ఆయన మరణం వెనుక అసలు నిజం ఏమిటి? ఇది సాధారణ ప్రమాదమా, లేక కుట్రనా? అనే ప్రశ్నలకు సమాధానం కోసం ఆయన శ్రేయొభిలాషులు ఎదురు చూస్తున్నారు.






