తెలుగువారికి భారతదేశ (India) చరిత్రలో ఒక ప్రత్యేక గౌరవస్థానం ఉంది. ఆత్మగౌరవం కోసం పోరాడిన చరిత్ర కలిగిన ఈ సమాజం, తమ స్వాభిమానాన్ని అత్యంత విలువైనదిగా భావిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రతి అంశానికీ ఆర్థిక లోటును కారణంగా చూపిస్తూ విరాళాల కోసం ముందుకు రావడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధికారంలో ఉన్నప్పుడు ఈ ధోరణి మరింత స్పష్టంగా కనిపిస్తున్నదని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.
2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమరావతి రాజధాని (Amaravati Capital City) నిర్మాణం కోసం విరాళాలు కోరుతూ హుండీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయంలో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఆ నిర్ణయాన్ని పెద్దగా వ్యతిరేకించలేదు. అయితే 2015లో ‘మై బ్రిక్..మై అమరావతి’ (My Brick..My Amaravati) కార్యక్రమం ద్వారా ఈ-ఇటుకల పేరిట విరాళాలు సేకరించడం జరిగింది. ఆ విరాళాల వినియోగంపై స్పష్టత లేకపోవడం ప్రజల్లో అనుమానాలకు కారణమైంది.
తాజాగా ‘డొనేట్ ఫర్ అమరావతి’ (Donate for Amaravati) వంటి కార్యక్రమాల ద్వారా మళ్లీ విరాళాలు కోరడం, రాజధాని స్వయం సమృద్ధి నగరమని చెప్పుకుంటూనే నిధుల కోసం ప్రజలపై ఆధారపడడం విమర్శలకు దారి తీస్తోంది. ఈ విధానం ఇతర రాష్ట్రాల ముందు అపహాస్యానికి కారణమవుతుందా అనే ప్రశ్నలు సామాన్య ప్రజలలో వినిపిస్తున్నాయి.
ఇక ఈ ధోరణి రాజధాని నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర రంగాలకు కూడా విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. పేదలను దత్తత తీసుకోవాలని సంపన్నులను కోరడం, దానిని పథకంగా ప్రచారం చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య బాధ్యతలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని స్వయంగా భరించాల్సిన బాధ్యత ఉన్నప్పుడు, ఆ బాధ్యతను ఇతరులపై మళ్లించడం ఎంతవరకు సమంజసం అనే సందేహం ఉత్పన్నమవుతోంది.
ఇక అన్నాక్యాంటిన్ (Anna Canteen) నిర్వహణకు విరాళాల సేకరణ చేయడం. అలాగే విద్య రంగం అభివృద్ధికి కూడా విరాళాల కోసం యాప్‌లను ప్రవేశపెట్టాలనే వార్తలు ప్రజల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇది ప్రభుత్వ ప్రాధమిక కర్తవ్యాల పట్ల నిర్లక్ష్యంగా భావించాలా అనే చర్చ సాగుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రతి అంశానికి విరాళాలు కోరడం ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మరియు సామాన్య ప్రజల్లో గట్టిగా వినిపిస్తోంది. ప్రజలు కడుతున్న పన్నులు, అభివృద్ది కోరకు చేస్తున్న అప్పులపై స్వేతపత్రం విడుదల చేసి ప్రభుత్వం చేస్తున్న ఖర్చులని ప్రజలకి వివరించిన తరువాత జోలె పడితే ప్రజలు అర్ధం చేసుకునే అవకాశం ఉందని లేని పక్షంలో ప్రభుత్వం రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందనే అభిప్రాయం ప్రజల్లో బలపడే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్న అంశం.






