విద్యార్థుల (Students) భవిష్యత్తుతో ముడిపడిన ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) పథకం అంశంపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనమండలిలో (Legislative Council) తీవ్ర రాజకీయ వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి నారా లోకేష్(Nara Lokesh) చేసిన వ్యాఖ్యలు అసత్యాల సమాహారమని వైఎస్సార్‌సీపీ(YSRCP) నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు బకాయిలను చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని వారు ఆరోపించారు.
తాము అధికారంలోకి వచ్చేనాటికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.4 వేల కోట్ల బకాయిలు పెట్టిందని లోకేష్ పేర్కొనడం అర్ధసత్యమని విమర్శించారు. వాస్తవానికి 2019లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వదిలి పెట్టిన రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వైయస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) నాయకత్వంలోని ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు.
2024 జనవరి నుంచి మార్చి త్రైమాసికానికి సంబంధించిన బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా, ఆ ప్రక్రియను కోర్టు వ్యవహారాల ద్వారా అడ్డుకున్నారని ఆరోపించారు. అనంతరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో చెల్లింపులు నిలిచిపోయాయని వివరించారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వ కాలంలో మొత్తం రూ.8,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, ఇప్పటివరకు కేవలం రూ.700 కోట్లు మాత్రమే చెల్లించారని పేర్కొన్నారు. ఇంకా రూ.7,800 కోట్ల బకాయిలు ఉండడం వాస్తవం కాదా అని లోకేష్‌ను ప్రశ్నించారు.
ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక మంత్రి డోలా బాల వీరాంజనేయులుతో కలిసి ఎదురుదాడికి దిగారని వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి కీలక అంశంపై అసత్యాలు ప్రచారం చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడం నీచ రాజకీయాలకు నిదర్శనమని వారు తీవ్రంగా విమర్శించారు.






