---Advertisement---

తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్న ఇందాపూర్ నెయ్యి ట్యాంకర్ బోల్తా.

March 9, 2026

---Advertisement---

తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ కడప జిల్లాలో బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలం చిత్రావతి వంతెన సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడినా, ట్యాంకర్‌లో ఉన్న నెయ్యి ఎక్కువ భాగం నేలకూలింది. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని బిందెలు, బకెట్లు, బాటిల్లు, చెంబులు, డ్రమ్ములతో నెయ్యిని తీసుకెళ్లడం ప్రారంభించారు. దాదాపు 21 వేల లీటర్ల నెయ్యిలో చివరకు 500 లీటర్లు మాత్రమే మిగిలిపోయినట్లు సమాచారం. పోలీసులు అక్కడికి చేరుకునేలోపు ఎక్కువ భాగం నెయ్యి ప్రజల చేతికి వెళ్లిపోవడంతో భారీ నష్టం జరిగింది.

ఈ ట్యాంకర్ మహారాష్ట్రలోని పూణే జిల్లాకు చెందిన ఇందాపూర్ డెయిరీ నుంచి తిరుమలకు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనతో తిరుమలలో లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యి సరఫరాపై భక్తుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే టీటీడీ అధికారులు వెంటనే స్పందించి ప్రస్తుతం భక్తులకు పంపిణీ చేయడానికి సుమారు ఏడు లక్షల లడ్డూ ప్రసాదాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. లడ్డూ తయారీ మరియు పంపిణీకి ఎలాంటి అంతరాయం లేదని, ఇతర రెండు సంస్థల నుంచి కూడా నెయ్యి సరఫరా కొనసాగుతోందని స్పష్టం చేశారు. వేసవి కాలంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుందని భావించి ముందస్తు ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలిపారు.

అయితే ప్రమాదానికి గురైన ట్యాంకర్ ఇందాపూర్ డెయిరీకి చెందినదిగా ఉండటంతో మరోసారి నెయ్యి సరఫరా కాంట్రాక్టుల అంశం చర్చకు వచ్చింది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థగా చెప్పబడుతున్న ఇందాపూర్ డెయిరీకి టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు ఇచ్చిన విధానంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. టీటీడీ తీర్మానం 590 ప్రకారం కిలో నెయ్యి రూ.658 చొప్పున 6.50 లక్షల కిలోల సరఫరా కాంట్రాక్టు, అలాగే తీర్మానం 605 ప్రకారం కిలో రూ.649 చొప్పున 3.50 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇదే సంస్థకు ఇచ్చినట్లు పేర్కొంటున్నారు. మొత్తం మీద దాదాపు రూ.65.48 కోట్ల విలువైన 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఈ సంస్థకు కట్టబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో అదే సంస్థకు చెందిన ట్యాంకర్ కడపలో ప్రమాదానికి గురవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మనుషుల ప్రాణనష్టం జరగకపోయినా, స్వామివారికి రావాల్సిన నెయ్యి ప్రజల చేతికి వెళ్లిపోవడం భక్తుల భావోద్వేగాలను తాకుతోంది. తిరుమల చరిత్రలో స్వామివారికి తీసుకెళ్తున్న నెయ్యి ట్యాంకర్ ఇలా బోల్తా పడిన ఘటన ఇదే మొదటిసారి కావడం విశేషంగా మారింది. ఈ ఘటనతో భక్తుల విశ్వాసాలు, అలాగే తిరుమలలో జరుగుతున్న కాంట్రాక్టుల వ్యవహారాలపై మరింత చర్చ మొదలైంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment