తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly) హేట్ స్పీచ్ బిల్లు (Hate Speech Bill) ప్రవేశపెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మంత్రిమండలి (Cabinet) ఆమోదం (Approval) పొందిన ఈ బిల్లును స్పీకర్ (Speaker) సెలెక్ట్ కమిటీకి (Select Committee) పంపించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే విద్వేషపూరిత వ్యాఖ్యలపై కఠిన చర్యలు తప్పవు.
7 ఏళ్ల జైలు నుంచి 10 ఏళ్ల శిక్ష వరకు కఠిన నిబంధనలు
ఈ బిల్లులో మతం (Religion), కులం (Caste), లింగం (Gender), భాష (Language) వంటి అంశాలపై విద్వేషాన్ని ప్రేరేపించే ప్రసంగాలు, రచనలు, సోషల్ మీడియా పోస్టులను నియంత్రించడమే ప్రధాన లక్ష్యం. మొదటిసారి నేరం రుజువైతే 7 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు ₹50,000 జరిమానా విధిస్తారు. అదే నేరం మళ్లీ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹1 లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ నేరాలను నాన్-బెయిలబుల్‌గా (Non-bailable) పరిగణిస్తారు.
ఇటీవల సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై సభలు, సమావేశాలు, సోషల్ మీడియా వేదికల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవు.
ఈ చట్టం ప్రకారం మతం, జాతి, కులం, వర్గం, లింగం, జన్మస్థలం, భాష, అశక్తత వంటి అంశాలపై ద్వేషాన్ని ప్రేరేపించే కంటెంట్‌ను నిషేధిస్తారు. ముద్రణ, ప్రచురణ, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా వచ్చే సమాచారం కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తుంది.
అసభ్యకర లేదా విద్వేషపూరిత కంటెంట్‌ను తొలగించాలని ఎలక్ట్రానిక్ మీడియా, సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశించే అధికారాన్ని కూడా ఈ బిల్లు ఇస్తుంది. ఇకపై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా లేదా రెచ్చగొట్టే పోస్టులు చేసినా జైలు శిక్ష తప్పదని ప్రభుత్వం స్పష్టం చేసింది.






