హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌పై పోలీసులు గట్టి దెబ్బకొట్టారు. నార్కోటిక్స్ విభాగం మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భారీ ముఠాను అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో మొత్తం 5 మంది పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.
రూ. 63.65 లక్షల డ్రగ్స్ సీజ్.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
పోలీసుల వివరాల ప్రకారం అరెస్ట్ అయిన వారిలో 1 అంతర్రాష్ట్ర పెడ్లర్, 1 స్థానిక పెడ్లర్, 3 సబ్ పెడ్లర్లు ఉన్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ. 63.65 లక్షల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అదనంగా మొబైల్ ఫోన్లు, వాహనాలు, నగదును కూడా పోలీసులు సీజ్ చేశారు.
ఈ కేసులో 18 ఏళ్ల విద్యార్థి సాయి నిఖిల్ యాదవ్ అరెస్టవ్వడం కలకలం రేపుతోంది. చిల్కలగూడ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి 115 గ్రాముల ఎండీఎంఏను (MDMA) స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ. 11.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
చదువు మధ్యలోనే ఆపేసిన సాయి నిఖిల్, వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో డ్రగ్స్ రవాణాలోకి దిగాడు. సబ్ పెడ్లర్‌గా మారి ఈ నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు వెల్లడించారు.






