హైదరాబాద్‌లో నిర్వహించిన సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్-2026లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)ను రాష్ట్రానికి తీసుకురావడం తన గొప్ప విజయాలలో ఒకటిగా పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలతో పోటీ పడి ఈ సంస్థను హైదరాబాద్‌కు తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. అయితే, ఈ ప్రకటనల వెనుక ఉన్న వాస్తవ పరిస్థితులపై వివాదాలు మళ్లీ చర్చకు వస్తున్నాయి.
ఐఎస్‌బీ స్థాపన సమయంలో మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు సంస్థకు భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, స్థానిక విద్యార్థులకు 30 నుంచి 50 శాతం వరకు కోటా కల్పించాలని షరతులు విధించాయి. కానీ హైదరాబాద్‌లో మాత్రం ఎలాంటి షరతులు లేకుండా సుమారు 250 ఎకరాల భూమిని కేటాయించడం విమర్శలకు దారి తీసింది. ముఖ్యంగా స్థానిక విద్యార్థులకు కనీస ప్రయోజనం లేకపోవడం పెద్ద ప్రశ్నగా మారింది.
ఈ ఐఎస్‌బీ రావడానికి చంద్రబాబు మరియు రజత్ గుప్తా పనిచేశారు. ఈ రజత్ గుప్తా మెకిన్సీ కంపెనీలో పనిచేసేవారు. ఐఎస్‌బీకి ఉచితంగా 250 ఎకరాలు కేటాయించి ఇక్కడికి వచ్చేలా డీల్ సెట్ చేసినందుకు, రజత్ గుప్తా పనిచేస్తున్న మెకిన్సీ కంపెనీకి ‘విజన్ 2020’ డాక్యుమెంట్ తయారు చేసే కాంట్రాక్ట్ రూపంలో 1999లోనే రూ. 2.5 కోట్లు చెల్లించారని ఆరోపణలు ఉన్నాయి. ఆ డాక్యుమెంట్ తరువాత చెత్త బుట్టలోకి వెళ్లిందని దాని వలన ఎలాంటి ప్రయొజనము కలగలేదని చెబుతారు.
ఇక, ఈ రజత్ గుప్తా అమెరికాలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులో 2 సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించారు. అలాగే, ఈ ఐఎస్‌బీకి డీన్‌గా వ్యవహరించిన రామ్ మోహన్ రావు అనే వ్యక్తి సత్యం కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించి స్కాంలో ఇరుక్కున్నారు. ఇలా ఈ ఐఎస్‌బీ కోసం పనిచేసిన వ్యక్తులు చుట్టూ తీవ్రమైన పలు వివాదాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
అయితే చంద్రబాబు గారి ఆలోచనకి విరుద్ధంగా, వైఎస్సార్ కాలంలో ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీలు, కొత్త విశ్వవిద్యాలయాలు, మెడికల్ కాలేజీలు వంటి సంస్థలు రాష్ట్ర విద్యార్థులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగించాయని అనేక ఉదాహరణలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీల విద్యార్థులు గేట్ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరచడం ద్వారా ఈ విధానాల ప్రభావం స్పష్టమవుతోంది. తాజాగా వందలాది మంది విద్యార్థులు అగ్రశ్రేణి ర్యాంకులు సాధించడం, ఐఐటీలు మరియు పీఎస్‌యూల్లో అవకాశాలు పొందడం రాష్ట్ర విద్యా అభివృద్ధికి దారితీసిన మార్పులను సూచిస్తోంది.
ప్రభుత్వ ఆస్తులను కేటాయించే సమయంలో ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాలనే వాదన మళ్లీ ముందుకు వస్తోంది. ఐఎస్‌బీ వ్యవహారంలో లాభం ఎవరికో, నష్టం ఎవరికో అన్న ప్రశ్నలు మరింతగా చర్చకు దారి తీస్తున్నాయి. ఇదే సమయంలో, రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తీసుకున్న నిర్ణయాలే నిజమైన అభివృద్ధికి సూచికలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






