మదనపల్లిలో (Madanapalle) జనసేన పార్టీ (Jana Sena Party) స్టేట్ జాయింట్ సెక్రటరీ & రాష్ట్ర ఏపీఐఐసీ డైరెక్టర్ గా ఉన్న మై ఫోర్స్ మహేశ్ (My Force Mahesh) పై తీవ్ర ఆరోపణలు చేస్తూ భాదితులు వెలుగులోకి రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మహేశ్ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకుని నెలల తరబడి అద్దె చెల్లించకుండా యజమానిని బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుల ప్రకారం, మై ఫోర్స్ మహేశ్ మదనపల్లిలోని ఒక అపార్ట్మెంట్లో రెండు ఫ్లోర్లు అద్దెకు తీసుకుని చాలా కాలంగా అద్దె చెల్లించలేదని తెలిపారు. అద్దె గురించి అడిగితే అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేయనని, తాను డీసీఎం పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan) సంబంధించిన వ్యక్తినని, నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) రైట్ హ్యాండ్ అని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితుడు పేర్కొన్నారు.
ఇదే సమయంలో, ఖాళీ చేయమని కోరినప్పుడు కుల వివాదాన్ని ప్రస్తావిస్తూ తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని హెచ్చరించినట్లు కూడా వారు ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై బాధితుడు జిల్లా ఏఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అదే విధంగా మరో వివాదం కూడా వెలుగులోకి వచ్చింది. మదనపల్లె ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి సహా మరో వ్యక్తి జిల్లా ఎస్పీని కలిసి మై ఫోర్స్ మహేశ్ పై మరో ఫిర్యాదు చేశారు. నమ్మకంగా మాయమాటలు చెప్పి తమ వద్ద నుంచి రూ.18 లక్షలు తీసుకున్నాడని, డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగగా అసభ్యకరంగా మాట్లాడి బెదిరింపులకు పాల్పడుతున్నాడని వారు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో మై ఫోర్స్ మహేశ్ పై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదులపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ వ్యవహారం మదనపల్లిలో రాజకీయంగా కూడా చర్చకు దారి తీసింది.
తాము రాజకీయాల్లో మార్పు తేవడానికే వచ్చామని చెప్పి ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని చివరికి రాష్ట్రంలో అనేక చోట్ల ప్రజలను జనసేన పారీ నేతలు బేదిరింపులతో వేదింపులకు దిగడం ఈ మధ్య కాలంలో అధికంగా ఉన్నాయని చర్చ ప్రజల్లో బలంగా వినిపిస్తున్న సమయంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం జనసేన పార్టీ భవిష్యత్తుపై నీలి నీడలు అలుముకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులనుండి వినిపిస్తున్న మాట.






