---Advertisement---

జనసేనలో ఉన్నా.. జగన్ కే దండం పెడతా అంటున్న ఎమ్మెల్సీ!

February 14, 2026

---Advertisement---

కైకలూరు నియోజకవర్గానికి (Kaikaluru Constituency) చెందిన జనసేన (Jana Sena Party) ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ (Jayamangala Venkataramana) తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మండలిలో వైసీపీ నేతల సమక్షంలో ఆయన చేసిన ప్రకటనలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. తాను ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే జగన్ ఫొటోకు(Jagan Photo) దండం పెట్టుకుని రోజును ప్రారంభిస్తానని బహిరంగంగా వెల్లడించడం సంచలనంగా మారింది. జనసేనలో కొనసాగుతున్నప్పటికీ జగన్‌పై తనకున్న వ్యక్తిగత గౌరవాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా వెల్లడించినట్లు తెలిపారు.

ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న కారణాలను వివరిస్తూ, జగన్ తనను వ్యక్తిగతంగా పిలిచి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని జయమంగళ వెంకటరమణ గుర్తుచేశారు. ఆ సమయంలో తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, ఎమ్మెల్సీ పదవి తన రాజకీయ, వ్యక్తిగత జీవితాలకు కొత్త దారిని చూపిందని చెప్పారు. ఈ క్రమంలో తన రాజకీయ ధోరణిని సరదాగా ‘శకుని’తో పోల్చుకోవడం నవ్వులు పూయించింది. దానికి స్పందించిన వైసీపీ ఎమ్మెల్సీలు, వైసీపీ నుంచి జనసేనకు వెళ్లిన మీరు అక్కడ ‘శకుని’లా వ్యవహరిస్తున్నారా అని హాస్యంగా వ్యాఖ్యానించారు.

ఇంకా 2014లో తాను టికెట్ పొందినట్లయితే పరిస్థితి వేరుగా ఉండేదని ఆయన పేర్కొన్నారు. అప్పటి టీడీపీ(TDP) ప్రభుత్వంలో మంత్రి అయిన కొల్లు రవింద్ర కంటే తానే సీనియర్‌నని, కైకలూరు సీటు తనకు దక్కాల్సిందని అన్నారు. అయితే ఆ టికెట్‌ను కామినేని శ్రీనివాస్ కు కేటాయించారని వెల్లడించారు.

స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం పొందిన అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2024లో అధికార మార్పుతో ఆయన జనసేనలో చేరిన విషయం తెలిసిందే. అయినప్పటికీ జగన్‌పై తన వ్యక్తిగత గౌరవాన్ని కొనసాగిస్తున్నానని చెప్పడం జనసేన వర్గాల్లో చర్చలకు దారి తీస్తూ భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ఆసక్తిని పెంచుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment