కడప జిల్లాలో సంచలనం సృష్టించిన యువతి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖాజీపేటలో యువతిని గొంతుకోసి హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడైన వెంకటేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే విచారణ కోసం తరలిస్తున్న సమయంలో అతడు కస్టడీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది.
కానిస్టేబుళ్లపై దాడి.. తప్పించుకునే ప్రయత్నం
మైదుకూరు నుంచి తరలిస్తున్న సమయంలో బసాపురం చెక్‌పోస్ట్ వద్ద నిందితుడు ఇద్దరు కానిస్టేబుళ్లపై దాడి చేసి పారిపోవడానికి యత్నించాడు. పోలీసులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతడు లొంగిపోకపోవడంతో అనివార్యంగా కాల్పులు జరిపారు. మూడు రౌండ్ల కాల్పుల్లో నిందితుడు మోకాళ్లకు గాయపడ్డాడు.
గాయపడిన వెంటనే పోలీసులు అతడిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసి, తిరస్కరించడంతో కోపంతో ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు, మహిళా సంఘాలు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.






