కూటమి ప్రభుత్వ (Alliance Government) అక్రమాలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) స్పష్టం చేశారు. అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తాం గానీ అన్యాయాలకు మాత్రం తలవంచమని ఆయన వ్యాఖ్యానించారు. ఇబ్రహీంపట్నంలో టీడీపీ(TDP) నాయకుల దాడికి గురైన వైసీపీ నేత జోగి రమేష్ (Jogi Ramesh) ఇంటిని సందర్శించిన కాకాణి, అనంతరం మీడియాతో మాట్లాడారు.
వైసీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్న అధికారులకు బహుమతులు, ప్రమోషన్లు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ బాంబులు, యాసిడ్‌తో దాడులు జరుగుతుండటాన్ని తీవ్రంగా ఖండించారు.
జోగి రమేష్ కుటుంబ సభ్యులపై కూడా కేసులు పెట్టడం అన్యాయమని పేర్కొన్న కాకాణి, జగన్ మోహన్ రెడ్డికి విధేయుడైన రమేష్‌కు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.






