కేరళ, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం మరింత ముదిరింది. కేరళ ప్రభుత్వ పనితీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బహిరంగ లేఖ విడుదల చేశారు. రాజకీయ విభేదాల పేరుతో వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.
అభివృద్ధి గణాంకాలతో కౌంటర్
అభివృద్ధి విషయంలో కేరళ దేశంలో అగ్రస్థానంలో ఉందని పినరయి విజయన్ పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి సూచికల్లో కేరళ మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ ఆరో స్థానంలో ఉందని గుర్తు చేశారు. ఈ విజయాలు ఎన్నో సంవత్సరాల కృషి ఫలితమని, దీనికి ఒకే పార్టీకి కీర్తి చెందదని వివరించారు.
అవినీతి విషయంలో కూడా కేరళ అత్యల్ప స్థాయిలో ఉందని, తెలంగాణ మాత్రం అవినీతి పరంగా ముందున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉందని విమర్శించారు. పేదరిక నిర్మూలనలో కేరళ ప్రత్యేక ప్రగతి సాధించిందని, అత్యంత పేదరికం లేకుండా మారిన రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు.
ఐటీ, పారిశ్రామిక రంగాల్లో కూడా కేరళ వేగంగా ముందుకు సాగుతోందని ఆయన వెల్లడించారు. కొత్త ఐటీ విధానాలతో ఎగుమతుల్లో పెద్ద వాటాను లక్ష్యంగా పెట్టుకున్నామని, అంతర్జాతీయ నౌకాశ్రయం ద్వారా ఆర్థిక వృద్ధిని మరింత పెంచాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలపై కూడా కేరళ రాజ్యాంగబద్ధంగా పోరాటం చేస్తోందని విజయన్ స్పష్టం చేశారు. మైనారిటీల హక్కులు, రాజ్యాంగ విలువల పరిరక్షణలో తమ ప్రభుత్వం వెనుకడుగు వేయదని అన్నారు.
ఇక గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. కేరళకు అవసరమైన ప్రాజెక్టులు ఆలస్యం చేశారని ఆరోపించారు.
లేఖ చివరలో రాజకీయాల్లో భాషా పరిమితులు పాటించాలని, హద్దులు దాటి మాట్లాడటం మంచిది కాదని రేవంత్ రెడ్డికి పినరయి విజయన్ ఘాటుగా హెచ్చరిక చేశారు.






