కొత్తగూడెం (Kothagudem) మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ (Mayor) ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో సమీకరణాలు క్షణక్షణం మారుతున్నాయి. ఈ కీలక సమయంలో కేటీఆర్(KTR) సీపీఐ(CPI)కి బేషరతుగా మద్దతు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.
అత్యధిక స్థానాలు గెలుచుకున్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాకి పూర్తి సహకారం అందిస్తామని కేటీఆర్ స్వయంగా ఫోన్(Phone) చేసి తెలియజేశారని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) వెల్లడించారు. “మీరు గెలిచారు కాబట్టి మద్దతు ఇస్తాం” అని కేటీఆర్ చెప్పిన మాటలు కొత్త రాజకీయ సమీకరణాలకు నాంది పలికాయి.
సీపీఐ వర్గాల ప్రకారం, ఈ పరిణామంతో మేయర్ పీఠం దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నగరాభివృద్ధికి వినియోగిస్తామని కూనంనేని స్పష్టం చేశారు. ఎవరైనా మద్దతు ఇస్తే స్వాగతిస్తామని, అనవసరంగా ఎవరి సహకారాన్నీ తిరస్కరించబోమని తెలిపారు.
ఇక బీఆర్ఎస్‌తో(BRS) పాటు కొంతమంది ఇండిపెండెంట్లు కూడా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే తుది నిర్ణయం తీసుకునే ముందు పార్టీ అంతర్గతంగా చర్చలు జరిపి స్పష్టత తీసుకురానున్నట్లు సీపీఐ వర్గాలు చెబుతున్నాయి. మరో రెండు రోజుల్లో జరిగే సమావేశం తర్వాత అసలు దిశ ఏంటో తేలనుంది. మొత్తానికి కొత్తగూడెం రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.






