పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ (Leander Paes) అధికార పార్టీ బీజేపీలో(BJP) చేరడం హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీలో (Delhi) జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు (Kiren Rijiju), సుకాంత మజుందార్ (Sukanta Majumdar) సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.
క్రీడలు, యువతపై ఫోకస్ చేస్తానన్న పేస్
పార్టీలో చేరిన అనంతరం లియాండర్ పేస్ ప్రధాని మోడీ (Narendra Modi), హోంమంత్రి అమిత్ షా (Amit Shah), పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి సేవ చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ముఖ్యంగా క్రీడలు, యువత అభివృద్ధిపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. బెంగాల్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, 1986లో తన క్రీడా ప్రస్థానం ప్రారంభమైనప్పుడు అవకాశాలు తక్కువగా ఉండేవని గుర్తుచేశారు. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడ్డాయని, అయినా ఇంకా అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
లియాండర్ పేస్ చేరికపై సుకాంత మజుందార్ (Sukanta Majumdar) స్పందిస్తూ బెంగాల్ బీజేపీకి ఇది పెద్ద బలం అని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పేస్ ప్రచారం చేస్తారని తెలిపారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలే పేస్‌ను ఆకర్షించాయని చెప్పారు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో పేస్ సాధించిన కాంస్య పతకం దేశానికి గర్వకారణమని కొనియాడారు.
టీఎంసీ నుంచి బీజేపీ వైపు మార్పు
లియాండర్ పేస్ 2021లో టీఎంసీ పార్టీలో చేరినా పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదు. ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనకపోవడంతో ఆయన భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మార్చి 24న కోల్‌కతాలో బీజేపీ నేతలను కలిసిన తర్వాత పార్టీ మార్పు ఊహాగానాలు మొదలయ్యాయి. చివరకు మంగళవారం బీజేపీలో చేరారు.
పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎన్నికలు ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.






