తెలంగాణ రాష్ట్రంలో (Telangana State) కీలకమైన పరిణామం చోటుచేసుకోబోతోంది. దశాబ్దాలుగా అడవుల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న మావోయిస్టు (Maoist) నాయకత్వం పెద్ద ఎత్తున జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మావోయిస్టుల లొంగుబాటుపై తెలంగాణ పోలీసులు అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
సీఎం సమక్షంలో అగ్రనేత గణపతి లొంగుబాటు
ఈ సమావేశంలో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి వెల్లడించనున్నారు. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన నాయకుడు ముప్పాళ్ల లక్ష్మణరావు (Muppala Lakshmana Rao) అలియాస్ గణపతి (Ganapathi) సీఎం సమక్షంలో లొంగిపోనున్నట్లు సమాచారం. ఆయనతో పాటు మరో 124 మంది వివిధ స్థాయిలకు చెందిన మావోయిస్టు నాయకులు, కమాండర్లు, కార్యకర్తలు కూడా లొంగిపోనున్నారు. వీరిలో మావోయిస్టు పార్టీ అగ్రనేత (Top Maoist Leader) దేవ్‌జీకి (Devji) చెందిన పీఎల్జీఏ (PLGA) విభాగానికి చెందిన సభ్యులు కూడా ఉండటం ప్రత్యేకంగా చర్చకు దారి తీస్తోంది.
లొంగుబాటుకు ప్రభుత్వ ప్రయత్నాలు
గణపతి సరెండర్ అంశాన్ని ముందుగానే మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి ఈ అంశంపై ప్రెస్‌మీట్ నిర్వహించడంతో ఈ పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. గత కొంతకాలంగా తెలంగాణ పోలీసులు (Telangana Police) మావోయిస్టులను ప్రధాన సమాజంలోకి తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
ఇంత పెద్ద సంఖ్యలో అగ్రనేతలతో సహా లొంగిపోవడం రాష్ట్ర భద్రతా చరిత్రలో కీలక మలుపుగా మారే అవకాశముంది. లొంగిపోయే మావోయిస్టులకు ప్రభుత్వం అందించే పునరావాస ప్యాకేజీలపై ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), డీజీపీ శివధర్ రెడ్డి (Shivdhar Reddy) ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో (Amit Shah) సమావేశమై చర్చించినట్లు సమాచారం.






