---Advertisement---

డీఎస్సీ అక్రమాలపై మంత్రి సమాధానం ఎందుకు చెప్పడంలేదు ? వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

June 14, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ(Mega DSC) నియామక ప్రక్రియపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి (Parvathareddy Chandrasekhar Reddy) మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. డీఎస్సీ పరీక్ష రాసిన సుమారు 3.50 లక్షల మంది అభ్యర్థులకు కూటమి ప్రభుత్వ హయాంలో అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలపై ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నప్పటికీ మంత్రులు సమాధానాలు చెప్పకుండా అధికారులను ముందుకు నెడుతున్నారని విమర్శించారు. అధికారులు నిర్వహిస్తున్న పాత్రికేయ సమావేశాల్లో కూడా ఎలాంటి స్పష్టత కనిపించడం లేదని పేర్కొన్నారు.

ఎస్‌సీఈఆర్‌టీ (SCERT) అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు (Naveen) సోషల్ స్టడీస్‌లో ఫస్ట్ ర్యాంకు, టీజీటీ తెలుగులో ఆరో ర్యాంకు రావడం అనుమానాలకు తావిస్తోందని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రశ్నపత్రాల తయారీలో నవీన్ పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయని, అతని ద్వారా పలువురికి ప్రశ్నపత్రాలు లీక్ (Question Papers Leak) అయ్యాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన రాలేదని, “వ్యవహారం కోర్టులో ఉంది” అనే కారణంతో అధికారులు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు.

స్పోర్ట్స్ డీఎస్సీ (Sports DSC) పేరుతో ప్రారంభించిన ప్రక్రియను చివరకు మెగా డీఎస్సీలో విలీనం చేయడం వల్ల గందరగోళం నెలకొందని ఆయన అన్నారు. మొత్తం డీఎస్సీ నిర్వహణలోనే అనేక అవకతవకలు జరిగాయని, వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలను ప్రజల ముందుంచుతానని స్పష్టం చేశారు.

రిజర్వేషన్ల అమలు, నార్మలైజేషన్ విధానం(Normalization Method), 1:1 రేషియోలో అభ్యర్థులను పిలవడం వంటి అంశాల్లో తీవ్రమైన ఉల్లంఘనలు జరిగాయని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వర్తించాల్సిన వర్టికల్ రిజర్వేషన్‌ను సక్రమంగా అమలు చేయకపోవడంతో వేలాది మంది అర్హులైన అభ్యర్థులు నష్టపోయారని అన్నారు. సీబీఎస్ఈ, నవోదయ ఇంగ్లిష్ మీడియం విద్యార్థులను కూడా అన్యాయంగా పక్కన పెట్టారని విమర్శించారు.

జాతీయ స్థాయి పరీక్షల్లో కూడా నార్మలైజేషన్‌ను దూరంగా ఉంచుతున్నప్పుడు జిల్లా స్థాయి డీఎస్సీలో దానిని ఎందుకు అమలు చేశారని ఆయన ప్రశ్నించారు. నార్మలైజేషన్ పేరుతో కొన్ని సెషన్లకు అదనపు మార్కులు జోడించి అక్రమాలకు పాల్పడ్డారని, 0.1 మార్కు తేడాతోనే వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. కష్టపడి చదివిన నిజాయితీ గల అభ్యర్థులు ఈ విధానం వల్ల తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న అభ్యర్థులను మానసికంగా వేధిస్తున్నారని, అధికార పక్ష సోషల్ మీడియా విభాగం వారిపై రకరకాల ముద్రలు వేస్తోందని చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. నిరుద్యోగుల హక్కులను కాపాడేందుకు బాధ్యతగల ప్రతిపక్షంగా డీఎస్సీ అక్రమాలను ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని చెప్పారు.

స్పోర్ట్స్ కోటా నియామకాలలో హయ్యెస్ట్ అచీవ్‌మెంట్, బ్యాకప్ సర్టిఫికేట్ నిబంధనలను కూడా అధికారులు ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. జూనియర్, సబ్ జూనియర్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సర్టిఫికేట్లను పరిగణనలోకి తీసుకోకూడదనే నిబంధనలను విస్మరించారని పేర్కొన్నారు.

అప్లికేషన్ నెంబర్ 20485లో ఒకే గేమ్‌కు సంబంధించిన రెండు సర్టిఫికేట్లను నిబంధనలకు విరుద్ధంగా పరిగణించారని, SDSC0002615 అప్లికేషన్‌లో వాలీబాల్ హయ్యెస్ట్ అచీవ్‌మెంట్ ఉండగా బ్యాకప్ సర్టిఫికేట్ కబడ్డీకి సంబంధించినదైనా ఉద్యోగం కేటాయించారని ఆయన వెల్లడించారు. హయ్యెస్ట్ అచీవ్‌మెంట్ ఉన్న గేమ్‌కు సంబంధం లేకుండా వేరే గేమ్ బ్యాకప్ సర్టిఫికేట్లను అంగీకరించడం ద్వారా నియామకాల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఎంపీసీ చదివిన వ్యక్తి ఇంటర్‌లో బైపీసీ చదివినట్లు చూపించినట్లుగా ఈ సర్టిఫికేట్ల వ్యవహారం ఉందని, దీంతో వాటి ప్రామాణికతపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment