టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటిపై టీడీపీ ఎమ్మెల్యే ఆద్వర్యంలో జరిగిన దాడిని ఖండిస్తూ సంఘీభావంగా వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా కాపు నాయకులతో సమావేశం అయిన అనంతరం ఆమే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంలో ఆమే మాట్లాడుతూ ఇళ్లపై కర్రలు, రాడ్లతో దాడులు చేయమని ఏ రాజ్యాంగం చెప్పిందని ఆమె గల్లా మాధవిని సూటిగా ప్రశ్నించారు. అధికార అహంకారంతో మాట్లాడుతూ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు.
వ్యవస్థలను నిర్వీర్యం చేసి తమ ఇంటిపై దాడి చేశారని, క్షమాపణ చెప్పేందుకు వచ్చామని చెబుతూనే కర్రలు, రాళ్లు, మారణాయుధాలతో దాడులు ఎలా చేస్తారని నిలదీశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఈ ఘటనపై సమాధానం చెప్పాలని, ఇలాంటి చర్యల ద్వారా పిల్లలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి పెమ్మసాని రాజకీయాల ప్రక్షాళన పేరుతో మరింత కలుషితం చేశారని విమర్శించారు. రాళ్ల దాడులు, కత్తులతో బెదిరింపులు, గోడలు పొడిచే చర్యల మధ్య అంబటి రాంబాబు ధైర్యంగా నిలిచారని పేర్కొన్నారు.
తమకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు గుర్తుకు వచ్చాడా అని జనసేన నాయకుల నుండి వస్తున్న ప్రశ్నలకు సమాధానంగా గతంలో పవన్ కళ్యాణ్ తల్లిపై దూషణలు చేసినవారు ఓట్ల కోసం ఆయనను ఆశ్రయించలేదా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ తమ ఇంటికి వచ్చినప్పుడు ఆభరణాలు పోయాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖండించారు. అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నానికి వ్యతిరేకంగా మద్దతు తెలిపేందుకు వచ్చిన కాపు నేతలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడాలని మాత్రమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను తాను కోరినట్లు, సోంత పనులు కోరుకోలేదని మౌనిక తెలిపారు.






