ముంబై (Mumbai) నగరంలో మరో నిర్మాణ ప్రమాదం ఆందోళన కలిగించింది. మహారాష్ట్ర (Maharashtra) రాజధాని ముంబైలోని ములుండ్ (Mulund) ప్రాంతంలో మెట్రో రైలుకు (Metro Rail Pillar) సంబంధించిన పిల్లర్ ఒక్కసారిగా కూలిపోవడంతో కలకలం రేగింది. రద్దీ సమయంలో ఈ ఘటన జరగడంతో పలువురు గాయపడినట్లు సమాచారం.
నిర్మాణ సమయంలోనే విరిగిన పిల్లర్ భాగం
శనివారం మధ్యాహ్నం సుమారు 12:20 గంటల సమయంలో ములుండ్ (పశ్చిమ)లోని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ (Johnson & Johnson Company) సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్లోని సిమెంట్ భాగం ఒక్కసారిగా విరిగి కిందికి పడింది. ఆ సమయంలో అక్కడుగా వెళ్తున్న ఆటోరిక్షాపై ఆ భాగం పడటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే ముంబై అగ్నిమాపక దళం, పోలీసులు, మెట్రో సిబ్బంది మరియు వార్డ్ సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. సబ్వే స్లాబ్ కూలిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఈ ఘటనతో మెట్రో నిర్మాణ పనుల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.






