పోలవరం నియోజకవర్గంలో (Polavaram Constituency) జనసేన ఎమ్మెల్యే (Jana Sena MLA) చిర్రి బాలరాజుపై (Chirri Balraju) దాడి యత్నం (Attack Attempt) జరిగిందంటూ వెలుగులోకి వచ్చిన ఘటనకు తాజాగా మరో కోణం జత కావడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మొదట ప్రచారంలోకి వచ్చిన కథనం ప్రకారం, జనసేన క్రీయాశీలక కార్యకర్త పూనెం వంశీ (Poonem Vamsi) గత కొద్దిరోజులుగా ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు వంశీని స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారని, అనంతరం ఆగ్రహంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లిన వంశీ అక్కడ వాగ్వాదానికి దిగడంతో పాటు దాడికి యత్నించాడని ప్రచారం జరిగింది. అప్రమత్తమైన గన్‌మెన్ అతడిని అడ్డుకుని, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వంశీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
అయితే ఈ ఘటనపై పూనెం వంశీ స్వయంగా విడుదల చేసిన సెల్ఫీ వీడియోతో (Selfie Video) పరిస్థితి కొత్త మలుపు తిరిగింది. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాను ఎమ్మెల్యేపై దాడి చేసేందుకు వెళ్లలేదని వంశీ స్పష్టం చేశాడు. పోలీస్ స్టేషన్‌లో (Police Station) తన బైక్‌ను(Bike) నిలిపివేయడంతో దాని గురించి వివరణ కోరేందుకే ఎమ్మెల్యేను కలవడానికి వెళ్లానని, కానీ సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఎమ్మెల్యే అనుచరులే తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించాడు.
అంతేకాకుండా కారులో నుంచి తుపాకీ (Gun) తీసుకువచ్చి తనను కాల్చేయాలని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారని కూడా వంశీ సంచలన ఆరోపణలు చేశాడు. తాను కేవలం “నేను చేసిన తప్పేంటి?” అని మాత్రమే ప్రశ్నించానని, దానికి బదులుగా తనను జైలుకు పంపించే ప్రయత్నం చేశారని పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తనపై చేస్తున్న మూడు ప్రధాన ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని వంశీ సవాల్ విసిరాడు. తాను అసత్య ప్రచారం చేశానని, మాజీ ఎమ్మెల్యేతో సంబంధాలు ఉన్నాయని, తనకు రూ.1 లక్ష అందిందని చేస్తున్న ఆరోపణలను మూడు రోజుల్లో నిరూపించాలని డిమాండ్ చేశాడు. లేనిపక్షంలో పరువు నష్టం దావా (Defamation Case) వేస్తానని హెచ్చరించాడు.
జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరని, తన కుటుంబ సభ్యులు అధికారికంగా ఫిర్యాదు చేస్తారని వంశీ వెల్లడించాడు. జనసేన కార్యకర్తగా తనకే న్యాయం జరగడం లేదని, అలాంటప్పుడు సాధారణ కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రశ్నిస్తూ పార్టీ నాయకత్వం స్పందించాలని కోరాడు.
వంశీ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై వివిధ ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తే బహిరంగంగా తీవ్ర విమర్శలు చేయడం జనసేనలో అంతర్గత విభేదాలపై కొత్త చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై అధికారిక దర్యాప్తు కొనసాగుతుండగా, ఇరువర్గాల ఆరోపణలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి.






