ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని రాజమహేంద్రవరం (Rajamahendravaram)లో కల్తీ పాలు (Adulterated Milk) ఘోర విషాదానికి దారి తీశాయనే వార్తలు గుప్పుమన్నాయి. చౌడేశ్వరి నగర్ మరియు వెంకటేశ్వర నగర్ కాలనీల్లో కల్తీ పాలు సేవించిన కారణంగా నలుగురు మృతి చెందగా (Four People Died) , మరో 13 మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తుంది. వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పితో బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒకే ప్రాంతంలో పలువురు అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. బాధితులంతా ఒకరు నుంచే పాలు కొనుగోలు చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని మాట వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కోరకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన గణేష్(Ganesh)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాలు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి, ఎవరు పంపిణీ చేస్తున్నారు, ఎన్ని గృహాలకు చేరుతున్నాయి, సరఫరా వ్యవస్థ వెనుక ఉన్నవారు ఎవరనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇదిలా ఉండగా, మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ, వైద్యులు, ఆశా కార్యకర్తలు తదితరులతో కూడిన 13 బృందాలు ప్రభావిత కాలనీల్లో ఇంటింటి సర్వే చేపట్టనున్నాయి. కల్తీ పాల వ్యవహారంపై అధికారులు అప్రమత్తమై ప్రజల ఆరోగ్య భద్రతకు అవసరమైన చర్యలు వేగవంతం చేశారు. ఈ ఘటన వెనుక అసలు కారణం ఏమిటి? బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్న అంశాలు ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.






