---Advertisement---

సాలూరు టీడీపీలో ముదురుతున్న అంతర్గత పోరు… భంజ్‌దేవ్ ఇంటికి పోలీసులు

March 11, 2026

---Advertisement---

విజయనగరం జిల్లా సాలూరులో తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు (రాష్ట్ర సివిల్‌ సప్లరు కార్పొరేషన్‌ డైరెక్టర్‌) ఆర్పీ భంజ్‌దేవ్‌ నివాసానికి పోలీసులు వెళ్లి విచారణ చేపట్టడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనధికార పీఏ సతీష్‌పై నమోదైన అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో భాగంగా భంజ్‌దేవ్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. బాధితురాలు భంజ్‌దేవ్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు కాల్ డేటాలో ఉన్నట్లు పోలీసులు తెలిపిన నేపథ్యంలో, ఈ కేసు వెనుక ఆయన పాత్ర ఉందా అనే కోణంలో విచారణ జరిపారు.

ఈ సందర్భంగా భంజ్‌దేవ్ స్పందిస్తూ, చాలా మంది బాధితులు తమ సమస్యలతో తనకు ఫోన్ చేస్తారని, ఆ కాల్ డేటాను ఆధారంగా తీసుకుని తప్పుడు కేసుల్లో ఇరికించడం సరికాదని ప్రశ్నించారు. మంత్రి సంధ్యారాణి తీరుపై పార్టీ అధిష్టానంతో మాట్లాడతానని కూడా ఆయన తెలిపారు. పీఏ సతీష్‌ను కాపాడేందుకు సీనియర్ నాయకులనే అనుమానించి అవమానించడం సరైంది కాదని భంజ్‌దేవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక ఈ వివాదానికి సంబంధించిన నేపథ్యం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భర్తను కోల్పోయి కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన మహిళను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశాడని, తర్వాత పక్కకు రావాలని లైంగికంగా వేధించాడని మంత్రి సంధ్యారాణి అనధికార పీఏ సతీష్‌పై బాధితురాలు ఆరోపణలు చేసింది. ఈ ఘటనపై ఆమె మహిళా సంఘాలతో కలిసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదు చేసిన తర్వాత మంత్రి కూడా తనను బహిరంగంగా దూషించిందని బాధితురాలు ఆరోపించింది.

అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. పీఏ సతీష్‌పై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, త్రివేణి మరియు సాలూరు మున్సిపల్ ఉద్యోగి దేవిశ్రీ కలిసి ఈ ఘటనను నాటకంగా సృష్టించారని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. మంత్రి పీఏ పేర్లతో ఫేక్ వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్లు తయారు చేసినట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించిందని ఆయన పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు త్రివేణి, దేవిశ్రీలను అరెస్ట్ చేసినట్లు కూడా పోలీసులు ప్రకటించారు.

అయితే ప్రజల్లో మాత్రం మరో చర్చ నడుస్తోంది. మంత్రి సంధ్యారాణి ప్రభావంతోనే బాధితురాలిపై ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుందని కొందరు విమర్శిస్తున్నారు. ఇప్పుడు అదే వివాదంలో టీడీపీకి చెందిన ఉపాధ్యక్షుడు భంజ్‌దేవ్ పేరును కూడా లాగడం రాజకీయంగా మరింత ఉద్రిక్తతను పెంచింది.

తన అనుచరులను కాపాడుకునే ప్రయత్నంలో మంత్రి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీలోనే ఒక వర్గం చర్చించుకుంటుండటం గమనార్హం. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన భంజ్‌దేవ్‌కు పార్టీలోనే ఇలా అవమానం జరగడంతో ఆయన అనుచరులు కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో సాలూరు టీడీపీలో అంతర్గత విభేదాలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment