---Advertisement---

ఏడాది గడిచినా టీడీపీ బీమా డబ్బులు అందలేదు? టీడీపీ కార్యకర్త ఆవేదన!

June 13, 2026

---Advertisement---

కోటి మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పిస్తున్నామని ఘనంగా ప్రకటించిన పార్టీ ప్రచారం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ప్రాగ్మాటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని, రూ.100 సభ్యత్వ రుసుముతో పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్త ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందజేస్తామని తెలుగుదేశం పార్టీ అప్పట్లో ప్రచారం చేసింది. కోటి మందికి ఒకేసారి ప్రమాద బీమా కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలోనే తొలిసారి అని కూడా పేర్కొంది.

ప్రమాద బీమా నిబంధనల ప్రకారం, సభ్యుడు ప్రమాదంలో మరణిస్తే 15 రోజుల్లోపు సమాచారం అందించాల్సి ఉండగా, 30 రోజుల్లో అవసరమైన ధ్రువపత్రాలతో నామినీ స్వయంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించాలని పార్టీ సూచించింది. కార్యకర్తల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, పార్టీ శ్రేణులే తమ బలమని ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు.

అయితే వాస్తవ పరిస్థితి ప్రచారానికి భిన్నంగా ఉందని కొందరు తెలుగుదేశం కార్యకర్తలే సామాజిక మాధ్యమాల వేదికగా ఆరోపిస్తున్నారు. సభ్యత్వ కార్డులను చూపిస్తూ, ప్రమాద బీమా క్లెయిమ్‌లు దాఖలు చేసినప్పటికీ నెలలు గడిచినా, కొన్నిచోట్ల ఏడాది దాటినా పరిహారం అందలేదని వారు పోస్టులు చేస్తున్నారు. ఈ అంశం ప్రస్తుతం పార్టీ అంతర్గత రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి చెందిన మాజీ మండల పార్టీ అధ్యక్షుడు సోమేపల్లి శ్రీనివాసరావు చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన పరిధిలో సభ్యత్వం తీసుకున్న ముగ్గురు కార్యకర్తలు ప్రమాదాల్లో మరణించి దాదాపు సంవత్సరం గడిచినా, అన్ని పత్రాలు పార్టీ కేంద్ర కార్యాలయానికి సమర్పించినప్పటికీ ఇప్పటివరకు బీమా పరిహారం అందలేదని ఆయన నారా లోకేష్‌ను ఉద్దేశించి ఎక్స్ వేదికగా కోరారు.

ఆ ముగ్గురిలో ఒకరు కారు ప్రమాదంలో మరణించగా, మరో ఇద్దరు మొక్కజొన్న పొలంలో పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. వీరంతా దళిత కుటుంబాలకు చెందినవారని, అందులో వద్దిపోగు ఆదిలక్ష్మి ముండ్లమూరు గ్రామ సర్పంచ్‌గా పనిచేస్తూ పాము కాటుతో మరణించారని కూడా వివరించారు. ఎన్నిసార్లు పార్టీ కార్యాలయాన్ని సంప్రదించినా బీమా పరిహారం అందకపోవడంతో, స్వయంగా నారా లోకేష్ జోక్యం చేసుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

దీంతో ప్రమాద బీమా పథకంపై ప్రచారం ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు పరిహారం కోసం సొంత పార్టీ నాయకులే బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది. బీమా క్లెయిమ్‌ల ఆలస్యంపై తెలుగుదేశం పార్టీ ఎలాంటి వివరణ ఇస్తుంది? బాధిత కుటుంబాలకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? అనే ప్రశ్నలకు సమాధానం కోసం ఇప్పుడు అందరి దృష్టి పార్టీ వైపే నిలిచింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment