తెలంగాణ (Telangana) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల (Assembly Budget Sessions) ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 26 నుంచి రెండు వారాల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈసారి శాసనసభ (Legislative Assembly), శాసనమండలి (Legislative Council) ఒకే ప్రాంగణంలో సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. సమావేశాల మొదటి రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాతి రోజున గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చ జరుగుతుంది.
ఫిబ్రవరి 28న ప్రభుత్వం బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. శాసనమండలి సమావేశాలు పాత అసెంబ్లీ హాల్లో నిర్వహించనుండగా, అసెంబ్లీ సిబ్బంది ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంది. ఈసారి సమావేశాలు రెండు వారాల పాటు కొనసాగించాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనపై ప్రీ బడ్జెట్ సమీక్షలు, శాఖలవారీ పరిశీలనలు పూర్తి చేసుకుంది.
సంక్షేమ పథకాలపై భారీ ఖర్చులు, కీలక నిర్ణయాలు
ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క్ (Mallu Bhatti Vikramarka) నేతృత్వంలో శాఖలవారీ సమీక్షలు పూర్తయాయి. ఈ బడ్జెట్లో రైతు సంక్షేమం, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతి వంటి ఆరు ప్రధాన గ్యారంటీలకు భారీగా నిధులు కేటాయించనున్నారు. అలాగే పెన్షన్లు, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి అంశాలపై ముఖ్య నిర్ణయాలు తీసుకోనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23న రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీ బడ్జెట్ సమావేశాలపై తుది నిర్ణయం తీసుకుంటుంది.






