పల్నాడు (Palnadu) జిల్లాలోని గుండ్లపాడు గ్రామంలో చోటుచేసుకున్న తోట చంద్రయ్య (Thota Chandrayya) హత్య (Murder) ఘటన రాజకీయ రంగు పులుముకున్న తీరు ఇప్పటికీ చర్చనీయాంశంగానే కొనసాగుతోంది. ఆ హత్యను ఆధారంగా చేసుకుని ఒక రాజకీయ పార్టీ ప్రత్యర్థి పార్టీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రజల ముందుకు తీసుకువచ్చిన కథనం నిజమా? లేక రాజకీయ ప్రయోజనాల కోసం అల్లిన వ్యూహాత్మక ప్రచారమా? అనే సందేహాలు, నారా లోకేష్(Nara Lokesh) మరోసారి ఈ హత్య గురించి ప్రస్తావించడంతో ఇప్పుడు మరింత బలపడుతున్నాయి.
గుండ్లపాడు గ్రామంలో హతుడు తోట చంద్రయ్య (Thota Chandrayya) (టీడీపీ)(TDP), నిందితుడు చింతా శివరామయ్య (Chinta Shivaramaiah) (వైసీపీ) (YSRCP) గుండ్లపాడు గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. చంద్రయ్యకు, శివరామయ్య మధ్య వారి ప్రాంతంలో వేసే సిమెంట్ రోడ్ విషయంలో గొడవలు వచ్చాయి. ఈ ఘటన జరిగిన ఏడాది తర్వాత మాచర్లకు టీడీపీ నుంచి జూలకంటి బ్రహ్మానందరెడ్డికి (Julakanti Brahmananda Reddy) ఇంచార్జ్ పదవి రావడంతో, అప్పటి నుంచి చంద్రయ్య శివరామయ్యను హతమారుస్తానని గ్రామంలో సవాల్ చేస్తూ తిరిగాడు. ఈ క్రమంలోనే, శివరామయ్య చంద్రయ్య కంటే ముందే అతన్ని హతమార్చాలని నిర్ణయించుకుని, తన కుమారుడితో పాటు ఆరుగురు అనుచరుల సహాయంతో చంద్రయ్యను హతమార్చాడని పోలీసులే స్వయంగా చెప్పిన విషయం. ఇందులో జగన్ పేరు కానీ పార్టీ పేరు గాని చెప్పమని నిందితులు కోరినట్టు రుజువులే లేవని ఆ గ్రామస్తులే చెబుతున్న మాట.
చరిత్రను పరిశీలిస్తే గుండ్లపాడు గ్రామం ఫ్యాక్షన్ హత్యలతో ముద్రపడిన ప్రాంతంగా కనిపిస్తుంది. 1971లో ప్రారంభమైన విభేదాలు క్రమంగా అనేక ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో తోట చంద్రయ్య హత్య కూడా పార్టీలకి అతీతంగా వ్యక్తిగత మరియు వర్గ విభేదాల ఫలితంగానే జరిగిందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ సంఘటనను రాజకీయ కోణంలో చూపిస్తూ , జగన్ (Jagan) పేరు, వైసీపీ పార్టీ పేరు పలకలేదనే ఈ హత్య అనే ప్రత్యేక కథనాన్ని తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి తీసుకువచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చంద్రయ్య మరియు ప్రధాన నిందితుడు మధ్య ఉన్న విభేదాలు, స్థానిక అభివృద్ధి పనులపై జరిగిన గొడవలు, తదనంతర సవాళ్లు, ఈ అంశాలు కలిసి ఈ హత్యకు దారితీశాయని తెలుస్తోంది. అయినప్పటికీ, ఈ ఘటనను వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లాభం పొందే ప్రయత్నం జరిగినట్టు, అందులో తెలుగుదేశం సఫలీకృతం అయినట్టు విమర్శలు ఉన్నాయి.
ఇంకా ముఖ్యంగా, అదే గ్రామంలో తరువాత జరిగిన హత్యల సందర్భంలో కూడా టీడీపీ పార్టీ అంతర్గత విభేదాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ, వాటిని బాహ్య రాజకీయ కుట్రలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. గతంలో జరిగిన ఘటనకు చూపిన సానుభూతి, సహాయం అధికారంలోకి వచ్చాక టీడీపీ ఇప్పుడు ఇతర బాధిత కుటుంబాలకు ఎందుకు అందడం లేదనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో, టీడీపీ లాంటి రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా సంఘటనలను మలుచుకుంటున్నాయా? వైసీపీ లాంటీ పార్టీలు వాస్తవాలను ప్రజలకు తెలియజేయడంలో విఫలమవుతున్నాయా? అనే అంశంపై విస్తృత చర్చ జరుగుతుంది.






