ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న తిరుమల(Tirumala) లడ్డూ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదంలో (Laddu Prasadam) జంతు కొవ్వు, చెత్త నూనె కలిపారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే సుప్రీం కొర్టు (Supreme Court of India) నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)(SIT) తన నివేదికలో ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టం చేయడంతో రాజకీయ వర్గాల్లో కూటమిపై విస్తృత ప్రతిచర్యలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సిట్ నివేదిక అనంతరం ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం మరింత వివాదాస్పదమైంది. సుప్రీం కోర్టు నియమించిన సిట్ నివేదికపై మళ్లీ కమిటీ వేయడం చట్టపరంగా సముచితమేనా అనే ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకోవడానికే ఈ చర్యలు చేపడుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ రాజకీయ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీం కోర్టును ఆశ్రయించడం మరో కీలక పరిణామంగా మారింది. సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన దర్యాప్తు సంస్థపై మరో కమిటీ నియమించడం న్యాయసూత్రాలకు విరుద్ధమని ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ (Justice Surya Kant) మరియు జస్టిస్ భాగ్చీ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ప్రతివాదులుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu), సిట్, సిబిఐ మరియు టిటిడి అధికారులు ఉన్నట్లు సమాచారం.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ (Dinesh Kumar) నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని పరోక్షంగా ప్రశ్నిస్తున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ వివాదం న్యాయపరంగా ఎటు దారి తీస్తుందో, సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.







