ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమలలో (Tirumala) ఇటీవలి ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శ్రీవారి ఆలయ పరిసరాల్లో నిషేధం ఉన్నప్పటికీ కొందరు యూట్యూబర్లు (YouTubers), ఇన్స్టాగ్రామ్ (Instagram) ఇన్ఫ్లుయెన్సర్లు (Influencers), యువజంటలు యథేచ్ఛగా ఫోటోషూట్లు, రీల్స్ (Reels), డాన్సులు (Dances) చేస్తూ వీడియోలు చిత్రీకరిస్తుండటం భక్తుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఘాట్ రోడ్డుపై నుంచి ఆలయం ఎదుట, పుష్కరిణి సమీపం, టికెట్ కౌంటర్ల వద్ద వరకు రీల్స్ హడావుడి కొనసాగుతుండటంపై భక్తుల్లో అసహనం కనిపిస్తుంది.
గొల్లమండపం నుంచి అఖిలాండం వరకు ఒక కొత్త జంట వివిధ భంగిమల్లో ఫోటోలు దిగిన ఘటన వివాదాస్పదమైంది. భక్తులు నిబంధనల ఉల్లంఘనగా పేర్కొంటూ తీవ్రంగా స్పందిస్తున్నారు. అదేవిధంగా శ్రీవారి ఆలయం ఎదుట రాజకీయ పోస్టర్లతో రీల్స్ చేయడం, జయలలిత మరియు పళనిస్వామి చిత్రాలతో పోస్టర్లు ప్రదర్శించడం కూడా ఆగ్రహానికి దారితీసింది.
ఇంకా కొందరు యువకులు నిషేధిత బెట్టింగ్ యాప్ల (Betting apps) ప్రమోషన్లు చేయడం, అన్యమత గీతాలతో రీల్స్ రూపొందించడం వంటి చర్యలు ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక తాజాగా యూట్యూబర్ గీతూ రాయల్ అండ్ టీం (Geetu Royal and Team) చేసిన హడావిడితో విజిలెన్స్ (Vigilance) సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిషేధం ఉన్నప్పటికీ చర్యలు ఎందుకు కనిపించడంలేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
పవిత్ర క్షేత్రంలో ఆచారాలు, నియమాలు కచ్చితంగా అమలవుతాయా? లేక సోషల్ మీడియా హడావుడి ముందు భద్రతా వ్యవస్థలు బలహీనమవుతున్నాయా? అనే సందేహాలు భక్తుల్లో పెరుగుతున్నాయి. తిరుమల పవిత్రతను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు మరింత బలపడుతున్నాయి.






