పవిత్ర తిరుమల క్షేత్రానికి చెందిన టిటిడి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న టీవీ5 చానల్ అధినేత బీఆర్ నాయుడు నియామకం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఆయన చైర్మన్ పదవికి అర్హుడు కాదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు గ్రాండ్ రిడ్జ్ హోటల్ ఎదుట శాంతియుతంగా నిరసన చేపట్టడం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. అయితే, ఈ నిరసనలో పాల్గొన్న 13 మందిపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం వివాదాన్ని మరింత పెంచింది.
ఈ పరిణామాల మధ్య కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ నాయకులపై నమోదైన అట్రాసిటీ కేసులో రిమాండ్‌ను కోర్టు తిరస్కరించడం గమనార్హం. అంతేకాకుండా, వారికి స్టేషన్ బెయిల్ మంజూరు చేయాలని ఆదేశించడం పరిస్థితిని కొత్త మలుపు తిప్పింది. దీంతో గ్రాండ్ రిడ్జ్ హోటల్ ఎదుట శాంతియుతంగా నిరసన చేస్తున్న సమయంలో అరెస్టైన 13 మంది విడుదలయ్యారు. అనంతరం వారిని వైసీపీ నాయకుడు భూమన అభినయ్ రెడ్డి కలిసి ధైర్యం చెప్పడం రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.






