విద్యార్థులకు సామాజిక బాధ్యతలు నేర్పాల్సిన చోట విద్యా వ్యవస్థను అపహాస్యం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కురుపాం మండలం నీలకంఠాపురంలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాల (Tribal Welfare Ashram High School for Boys)లో 10వ తరగతి విద్యార్థుల కోసం నిర్వహించిన ఫేర్వెల్ డే వేడుకల్లో హిజ్రాలను ఆహ్వానించి రికార్డింగ్ డ్యాన్సులు (Recorded Dances), అశ్లీల హావభావాలతో కూడిన నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
చిన్న వయసులో ఉన్న విద్యార్థుల సమక్షంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వారి మానసిక వికాసంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల సంస్కారం, క్రమశిక్షణ, భవిష్యత్తుకు మార్గదర్శనం చేయాల్సిన పవిత్ర స్థలంగా ఉండాలని గ్రామ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. అలాంటి చోట ఇలాంటి ఘటనలు జరగడం సమాజానికి తలవంపుగా మారిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
విషయం బయటపడటంతో తల్లిదండ్రులు, ఎస్ఎఫ్ఐ నాయకులు పాఠశాల యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని చర్యలు చేపట్టకపోతే విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసం మరింత దెబ్బతింటుందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇంత జరిగిన గిరిజన శాఖ మంత్రి ఉండి కానీ , విద్యాశాఖ మంత్రి నుండి కానీ ఎలాంటి చలనం లేకపోవడం దురదౄష్టం అని పలువురు వాఖ్యానిస్తున్నారు.






