అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌పై (Iran) మరోసారి కఠిన వైఖరి వ్యక్తం చేశారు. ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, భవిష్యత్తులో కూడా చర్చలకు తావు లేదని తేల్చిచెప్పారు. అమెరికా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, రాబోయే రెండు నుంచి మూడు వారాల్లో ఇరాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చమురు క్షేత్రాలపై దాడుల హెచ్చరిక
ఇరాన్‌ను అణ్వస్త్ర శక్తిగా మారనివ్వబోమని ట్రంప్ స్పష్టం చేశారు. అవసరమైతే చమురు క్షేత్రాలపై (Oil Fields) కూడా దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే యుద్ధం మాత్రం ఎక్కువ కాలం సాగదని, త్వరలో ముగుస్తుందని సంకేతాలు ఇచ్చారు. ఇరాన్‌పై ఆపరేషన్ కొనసాగుతోందని, తమ లక్ష్యాలకు చాలా దగ్గరగా ఉన్నామని తెలిపారు.
హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) విషయంలో అమెరికాకు పెద్దగా ఇబ్బంది లేదని ట్రంప్ పేర్కొన్నారు. దానిపై ఆధారపడే దేశాలే తమ భద్రతను చూసుకోవాలని సూచించారు. ప్రపంచ దేశాలు అమెరికా నుంచి చమురు కొనుగోలు చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
గల్ఫ్ దేశాలను రక్షించడానికి అన్ని మార్గాల్లో సహాయం చేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. ఇరాన్ సైనిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని, వారి నౌకాదళం, వైమానిక దళం, సైనిక కమాండ్ దాదాపు నాశనం అయిందని పేర్కొన్నారు.
ఇక వెనిజులా (Venezuela) విషయంలో కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వేగవంతమైన చర్యలతో ఆ దేశాన్ని తమ ప్రభావంలోకి తీసుకువచ్చామని చెప్పారు. అక్కడి చమురు, గ్యాస్ వనరులను అభివృద్ధి చేసేందుకు సంయుక్తంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు.






