ఐపీఎల్‌లో(IPL) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్టు భారీ డీల్ (Deal)తో చేతులు మారిన విషయం తెలిసిందే. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (United Spirits Limited) సంస్థ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ ఫ్రాంచైజీని ఏకంగా రూ.16,706 కోట్లకు విక్రయించారు. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బీఎక్స్‌పీఈ-బ్లాక్‌స్టోన్ సంస్థలు కలిసి ఈ జట్టును సొంతం చేసుకున్నాయి. పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టును కూడా ఈ కన్సార్షియం తీసుకోవడం విశేషం.
“నవ్విన వాళ్లే.. నేడు గర్వపడే స్థాయి” – మాల్యా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ యజమాని విజయ్ మాల్యా (Vijay Mallya) ఈ అమ్మకంపై సోషల్ మీడియాలో భావోద్వేగంగా స్పందించారు. కొత్త యజమానులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
2008లో ఈ ఫ్రాంచైజీని (Franchise) రూ.450 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు చాలా మంది తనపై విమర్శలు చేశారని మాల్యా గుర్తుచేశారు. అది పనికిరాని పెట్టుబడి అని అప్పట్లో నవ్వుకున్నారని తెలిపారు. కానీ తన లక్ష్యం కేవలం జట్టు కొనుగోలు కాకుండా ‘రాయల్ ఛాలెంజ్’ బ్రాండ్‌ను (Royal Challenge Brand) నిర్మించడమేనని చెప్పారు. అందుకే జట్టుకు ఆర్సీబీ అనే పేరు పెట్టానన్నారు.
అప్పట్లో పెట్టిన రూ.450 కోట్ల పెట్టుబడి నేడు రూ.16,706 కోట్లకు పెరగడం తనకు ఎంతో గర్వంగా ఉందని మాల్యా పేర్కొన్నారు. అలాగే యువ ఆటగాడిగా ఉన్న విరాట్ కోహ్లీని (Virat Kohli) జట్టులోకి తీసుకోవడం తన జీవితంలోని మధురమైన నిర్ణయాలలో ఒకటని చెప్పారు. నేడు అతను ప్రపంచ స్థాయి ఆటగాడిగా ఎదగడం ఆనందంగా ఉందన్నారు.
చివరిగా ఆర్సీబీ అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, జట్టుకు వారి మద్దతు ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకున్నారు.






