మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు (Murder Case) మరోసారి రాజకీయంగా వేడెక్కుతోంది. ఈ కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీత (YS Sunitha Reddy) ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్‌కు ప్రతిస్పందనగా వైసీపీ ఎంపీ(YSRCP MP) వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) నేడు మీడియా సమావేశం నిర్వహించి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కేసు ప్రారంభం నుండి గుండెపోటు సిద్ధాంతాన్ని తానే ప్రచారం చేశానని తనపై జరుగుతున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని ఆయన స్పష్టం చేశారు. నిజానికి వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారని మొదటగా చెప్పింది సునీతతో పాటు నర్రెడ్డి (Narreddy), రాజశేఖర్ రెడ్డి (Rajasekhar Reddy), శివప్రకాశ్ రెడ్డి (Shivaprakash Reddy) అని అవినాష్ రెడ్డి తెలిపారు.
అంతేకాకుండా బీజేపీ ఎమ్మెల్యేగా(BJP MLA) ఉన్న ఆదినారాయణ రెడ్డికి (Adinarayana Reddy) కూడా వివేకా గుండెపోటుతో చనిపోయారని నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి (Shivaprakash Reddy) చెప్పిన విషయాన్ని ఆయనే అధికారుల ముందూ, మీడియా ముందూ వెల్లడించారని అవినాష్ రెడ్డి గుర్తు చేశారు.
ఇక వివేకానంద రెడ్డికి రెండో భార్య ఉన్న విషయం గురించి సునీత ఎందుకు మాట్లాడటం లేదని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. రెండో భార్యకు కుమారుడు ఉన్నాడని, అతను ఆస్తిలో వారసుడవుతాడా లేదా అనే అంశాన్ని ఎందుకు ప్రస్తావించడంలేదని నిలదీశారు. హత్య జరిగిన రోజే వివేకా ఇంట్లో ఉన్న రౌండ్ సీల్ డాక్యుమెంట్లు దొంగిలించబడ్డాయని నివేదికల్లో స్పష్టంగా ఉందని, అదే విషయాన్ని హత్యలో పాల్గొన్న నిందితులే వాంగ్మూలంగా అధికారులకు చెప్పారని తెలిపారు. అయితే ఈ అంశాన్ని కూడా సునీత ఎందుకు ప్రస్తావించడంలేదని ప్రశ్నించారు.
హత్యలో నిందితుడిగా ఉన్న దస్తగిరి బెయిల్ (Dastagiri Bail) రద్దు చేయాలని తమవైపు నుంచి కేసులు వేస్తున్నప్పటికీ, సునీత ఆ ప్రక్రియలో ఇంప్లీడ్ అయి ఎందుకు అడ్డుపడుతున్నారో చెప్పాలని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. కూతురిగా హత్యలో పాల్గొన్న వ్యక్తులను జైలుకు పంపించే బాధ్యత సునీతకు లేదా అని ప్రశ్నించారు.
అలాగే హత్య జరిగిన రోజు వివేకా వద్ద ఉండే అటెండర్‌కు సునీత భర్త రాజశేఖర్ సెలవ ఇచ్చి కాణిపాకం వెళ్లమని ఎందుకు పంపించారని కూడా ఆయన ప్రశ్నించారు. ఇలాంటి కీలక విషయాలను ఎందుకు సునీత ప్రస్తావించడంలేదో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
డాక్యుమెంట్లు దొంగిలించబడిన అంశం ఉన్నప్పటికీ దీనిని “మర్డర్ ఫర్ గెయిన్” (Murder for Gain) కోణంలో పరిశీలించకుండా ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారో సమాధానం చెప్పాలని అవినాష్ రెడ్డి కోరారు. ఒకప్పుడు సునీత స్వయంగా తన తండ్రి అవినాష్, జగన్ గెలుపు కోసం నెలరోజుల పాటు కష్టపడ్డారని మీడియా ముందే చెప్పారని, అయితే తర్వాత ఎందుకు మాట మార్చారో ప్రజలకు చెప్పాలని అన్నారు.
తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నట్టు కనిపిస్తోందని, నిజమైన హంతకులను కనుగొనే దిశగా ఆసక్తి కనిపించడం లేదని అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అయితే ఇప్పటికైనా కోర్టులను తప్పుదారి పట్టించకుండా ట్రయల్‌కు సహకరిస్తే నిజమైన నిందితులు త్వరలోనే బయటపడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసును ఉపయోగిస్తే చివరికి నష్టపోయేది సునీతేనని కూడా హెచ్చరించారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిని నమ్మి తనను విమర్శించిన ప్రజలు కూడా త్వరలో నిజం తెలుసుకుంటారని, ఆ రోజునే తనకు మద్దతుగా నిలుస్తారని అవినాష్ రెడ్డి తెలిపారు.






