వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) గుంటూరు పర్యటనకు బయల్దేరారు. టీడీపీ శ్రేణుల దాడుల్లో తీవ్రంగా ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) నివాసం, కార్యాలయాన్ని పరిశీలించడంతో పాటు ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ ఈ పర్యటన చేపట్టారు.
ఇటీవల గుంటూరులో టీడీపీ అల్లరి మూకలు అంబటి రాంబాబు ఇంటి, కార్యాలయంపై విచక్షణారహితంగా దాడులు చేసి పూర్తిగా ధ్వంసం చేసిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన వైఎస్ జగన్, బాధిత కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో గుంటూరుకు వెళ్లాలని నిర్ణయించారు.
అయితే జగన్ పర్యటనకు ముందే గుంటూరులో పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. నగరాన్ని అష్టదిగ్బంధనం చేస్తూ నాలుగు వైపులా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు పర్యటనకు హాజరుకాకుండా నోటీసులు జారీ చేయడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. మాజీ ముఖ్యమంత్రి పర్యటనకే అడ్డంకులు సృష్టించడం ప్రజాస్వామ్య విరుద్ధమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో ఎంఎల్సీ లేళ్ల అప్పిరెడ్డి (Lella Appireddy) ఇంటికి అర్ధరాత్రి రెండుసార్లు పోలీసులు వెళ్లడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇంటి గోడకు నోటీసు అంటించి ఫోటోలు తీసి, వెంటనే తొలగించి వెళ్లిన పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇది కావాలనే భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నమని వారు ఆరోపిస్తున్నారు.
అంబటి రాంబాబు విషయంలో టీడీపీ శ్రేణుల దాడులు మరింత వివాదాస్పదంగా మారాయి. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, రెచ్చగొట్టిన వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అంతేకాదు, తాను మాట్లాడిన మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారని భావించి వాటిని వెనక్కి తీసుకుంటానని ప్రకటించినప్పటికీ, టీడీపీ గూండాలు హత్యాయత్నానికి పాల్పడి ఆయన ఇల్లు, కార్యాలయాన్ని ధ్వంసం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో పోలీసు ఆంక్షలు, రాజకీయ దాడులపై వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.






